Student Dies After Drinking Pesticide : శీతల పానీయం అనుకొని పురుగు మందు తాగిన ఓ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లాలోని నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన జింక వెంకటేష్, అంజలి దంపతుల కూమార్తె కీర్తన (19) గజ్వేల్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. రెండు సంవత్సరాల కిందట వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి అంజలి కూలీ పని చేస్తూ తన ఇద్దరమ్మాయిలను చదివిస్తోంది. ఇల్లును మరమ్మతులు చేసేందుకు సామగ్రిని పక్కింట్లోకి మార్చారు. ఈ నెల 4న కాలేజీకి వెళ్లిన కీర్తన రాత్రి ఇంటికి వచ్చింది.
సామగ్రిని మార్చిన ఇంట్లో సీసాలో ఉన్నది శీతల పానీయం అనుకొని పురుగు మందు తాగింది. 2 గంటల తరువాత అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబీకులు స్థానికంగా ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స చేయించారు. పరిస్థితి తీవ్రం కావడంతో 2 రోజుల తరువాత లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కీర్తనను పరీక్షించిన వైద్యులు ఆమె తాగిన సీసాను తెప్పించారు. పరిశీలించి చూడగా అందులో గడ్డి మందు ఉందని వైద్యులు తేల్చారు. మెరుగైన చికిత్స అందించగా మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందింది. తల్లి అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
అక్వేరియం పగిలిందని - తండ్రిని వెంటాడి చంపిన కుమారుడు
కుమార్తెతో అసభ్య ప్రవర్తన - భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
రంగారెడ్డి జిల్లా జంట హత్యల కేసులో ట్విస్ట్ - వివాహేతర సంబంధమే కారణమా?