Blast in South Glass Factory in Shadnagar : గ్యాస్ కంప్రెషర్ పేలి ఆరుగురు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో అయిదుగురు మృతిచెందగా, 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంప్రకాశ్ (45), రథికాంత్ (25), అయోధ్య బస్తీ ప్రాంతానికి చెందిన నికేత్ (22), రాంసేత్ (22)గా గుర్తించారు.
కంప్రెషర్ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన ఒకరికి శంషాబాద్ నిమ్స్‌లో, మిగతా 9 మందికి షాద్‌నగర్ వైవా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కంప్రెషర్ సేఫ్టీ వాల్ పనిచేయకపోవడం వల్ల పేలుడు జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోయనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
"సౌత్ గ్లాస్ కంపెనీలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ బ్లాస్ట్‌లో అయిదుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. కంపెనీకి చెందిన ఇద్దరు యాజమానులను అందుబాటులోకి తీసుకున్నాము. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము". - రాజేశ్, శంషాబాద్ డీసీపీ
స్పందించిన ముఖ్యమంత్రి.. మరోవైపు షాద్‌నగర్ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్పష్టం చేశారు.