A Boy Died After a Piece of Chicken Got Stuck in His Throat :అప్పటి వరకు ఇంట్లో బుడి బుడి అడుగులేస్తూ, నవ్వుతూ అల్లరి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అకస్మాత్తుగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏమైందోనని తల్లడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మరణించాడు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేట మండలం మన్నూరుకు కొంతకాలం కిందట వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆదివారం చికెన్ తెచ్చుకుని వండుకుని తిన్నారు. పనులకు వెళ్లాలని సిద్ధమవుతుండగా, వాళ్ల రెండున్నరేళ్ల కుమారుడు సుశాంక్ కింద పడి ఉన్న చికెన్ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కింద పడిపోయాడు. ఏమైందోనని ఆందోళనతో తల్లిదండ్రులు లేపాలని చూడగా, అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన బాబును వైద్యులు పరిశీలించగా, చికెన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందాడని నిర్ధారించారు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి, అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున ఏడ్చారు.
Child Died Due to Peanut Seed in Satyasai District: అయ్యో పాపం.. పాప ప్రాణం తీసిన వేరు శనగ గింజ