Officers Action on Hyderabad CCS :హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) కీలకమైనది. ఇటీవల కొందరు అవినీతి అధికారుల వల్ల బాధితులు తమకు ఇక్కడ న్యాయం జరుగుతుందా అనే సందిగ్ధంలో పడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అతను భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. తాజాగా సీసీఎస్ ఈఓడబ్ల్యూ టీమ్-7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలా మరికొందరు అధికారులు కేసుల విషయంలో లంచాలు ఆశిస్తున్నారని కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు : ప్రధానంగా సీసీఎస్‌కు జాయింట్ కమిషనర్ అంటే ఐజీ స్థాయి అధికారి ఇంఛార్జిగా ఉంటారు. ఇందులోని అర్ధిక నేరాల విభాగం సంచలన కేసులు, అమాయకుల సొమ్మును కాజేసే ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు పనిచేస్తుంది. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసు స్టేషన్లలో నమోదైన ఆర్థిక నేరాలు కూడా వాటి తీవ్రతను బట్టి కమిషనర్, దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు.
సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. గతేడాదిలోనే సాహితి ఇన్‌ఫ్రా మోసం సహా కొన్ని వేల కోట్ల రూపాయల స్కాములు సీసీఎస్‌లో దర్యాప్తు దశలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్ఠాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ఠ దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాయింట్ సీపీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను బదిలీ చేశారు. కానీ ఆ స్థానంలో మరెవరనీ నియమించలేదు.
ఏసీపీ ఉమామహేశ్వరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌పై సస్పెన్సన్ వేటు :ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం సివిల్ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చకూడదు. కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా సీసీఎస్ అధికారులకు కలిసి వస్తోంది. సీసీఎస్‌లో నమోదయ్యే, ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాళ్లో చాలా వాటిని సివిల్-క్రిమినల్ అని విడదీయడానికి మధ్యలో చాలా చిన్న సాంకేతిక గీత మాత్రమే ఉంటుంది.