WTC 2023 - 25 Points Table TeamIndia : సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంటా బయట టెస్టుల్లో ప్రత్యర్థి జట్లపై మంచిగా రాణిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన ప్రదర్శనతో పెత్తనం చెలాయిస్తోంది. తాజాగా బజ్‌బాల్‌తో భయపెడుతున్న బలమైన ఇంగ్లాండ్ టీమ్‌ను కూడా ఓడించేసింది. సొంతగడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో చిత్తుచేసింది. అలా ద్వైపాక్షిక సిరీసుల్లో తన స్టామినో ఏంటో చూపిస్తున్న టీమ్‌ఇండియాను ఒక్కటి మాత్రం ఊరిస్తోంది. అదే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్. అయితే ఇప్పుడు తాజా సిరీస్ విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకున్న భారత జట్టు వరుసగా మూడోసారి ఫైనల్ చేరే దిశగా సాగుతోంది. ఈ డబ్ల్యూటీసీలో ఫైనల్ చేరేందుకు మిగతా జట్లతో పోలిస్తే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
అగ్రస్థానంలో భారత్ : డబ్ల్యూటీసీ 2023- 25 సైకిల్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లు అన్నీ ముగిసే సమయానికి పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఈ టైటిల్ కోసం పోటీపడతాయి. అయితే ప్రస్తుతానికి ఈ డబ్ల్యూటీసీ చక్కంలో టీమ్ ఇండియా 9 మ్యాచులు ఆడి 6 విజయాలు సాధించింది. ఓ డ్రా కూడా నమోదు చేసింది. రెండు మ్యాచుల్లో ఓడింది. దీంతో మొత్తం 68.51 పాయింట్ల శాతం ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, రెండు ఓటములను అందుకుంది. అలా 60 పాయింట్ల శాతంతో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, మూడు ఓటములు, ఓ డ్రా నమోదు చేసి 59.09 పాయింట్ల శాతాన్ని అందుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పోలిస్తే పాయింట్ల పరంగా భారత్ మెరుగ్గా ఉంది.
ఆ టఫ్ ఛాలెంజ్‌ను దాటితే : ఇకపోతే ఈ చక్రంలో టీమ్ ఇండియా ఇప్పటికే వెస్టిండీస్‌పై 2 టెస్టులు, దక్షిణాఫ్రికాపై 2 మ్యాచులతో కూడిన సిరీస్ , ఇంగ్లాండ్‌పై 5 మ్యాచులతో కూడిన సిరీస్‌లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్‌తో 2 మ్యాచులు కూడిన సిరీస్ , న్యూజిలాండ్‌తో 3 మ్యాచులు కూడిన సిరీస్, ఆస్ట్రేలియాతో 5 మ్యాచులు కూడిన సిరీస్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లను టీమ్ ఇండియా సొంతగడ్డపైనే ఆడనుంది. ఇది పెద్దగా ఇబ్బంది కాదనే చెప్పాలి. అవసరమైతే క్లీన్‌స్వీప్ కూడా చేయగలదు. కానీ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్లోనే టీమ్ ఇండియాకు టఫ్ ఛాలెంజ్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్‌లు గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా టీమ్ ఇండియాను ఓడించాలని ఆ జట్టు గట్టి పటుదలతో ఉంది. అలానే కమిన్స్ కెప్టెన్సీలో బలంగా కూడా తయారైంది. కాబట్టి భారత్ ఆస్ట్రేలియా పరీక్షను దాటితే కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.
కాగా, ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఒక్కో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు వస్తాయి. మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ అయితే పాయింట్లలో కోత కూడా విధిస్తారు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమ్ ఇండియాకు 2 పాయింట్లు కోత కూడా పడింది.