WPL 2024 Playoffs:2024 డబ్ల్యూపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు బుధవారంతో ముగిశాయి. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 7 వికెట్ల ఘన విజయం అందుకుంది. దీంతో ఐదు జట్లతో ఆరంభమైన టోర్నీలో మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించగా, రెండు టీమ్‌లు ఇంటిబాట పట్టాయి. ఈ టోర్నమెంట్లో 8 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 6 విజయాలు సాధించిన దిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, దిల్లీ వరుసగా రెండో సీజన్లోనూ ఫైనల్‌కు చేరడం విశేషం.
ఇక పాయింట్ల టేబుల్లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబయి ఇండియన్స్ (5 విజయాలు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (4 విజయాలు) ఎలిమినేటర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మార్చి 15న జరిగే ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు, ఫైనల్లో దిల్లీతో తలపడనుండగా, ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
అయితే రెండోసారి టైటిల్ నెగ్గి డిఫెండిగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని ముంబయి ఆశిస్తుంటే, ఎలాగైనా తొలిసారి కప్పును ముద్దాడాలని దిల్లీ, బెంగళూరు పట్టుదలతో ఉన్నాయి. కాగా, ఇప్పటికే ఫైనల్ చేరిన దిల్లీ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉండగా, ముంబయి, బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గాల్సి ఉంది. కాగా, ఈ టోర్నమెంట్లో పేలవ ప్రదర్శన కనబర్చిన యూపీ వారియర్స్ (3 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (2 విజయాలు) లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.