Gukesh Favourite Movie : ఇటీవల భారత యువ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులోనే (18 ఏళ్లు) ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా వీలు కుదిరినప్పుడు తాను సినిమాలు చూస్తుంటానని చెప్పాడు. తనకు ఇష్టమైన చిత్రాల గురించి తెలిపాడు.
"అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. ఇష్టమైన మూవీస్ చాలానే ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం అంటే చాలా ఇష్టం. తమిళంలో సూర్య నటించిన వారణం ఆయిరం (సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగు టైటిల్) చాలా బాగుంటుంది. హిందీలో ఆమిర్ ఖాన్ మూవీ జిందగీ నా మిలేగీ దోబారా కూడా ఇష్టం. హాలీవుడ్‌లో అయితే అబౌట్ టైమ్ ఇష్టం." అని గుకేశ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం గుకేశ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విజయ్ దేవరకొండ సినిమా గురించి గుకేశ్ మాట్లాడటంతో హీరో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చెన్నైకు చెందిన గుకేశ్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి చెస్ ఛాంపియన్‌గా టైటిల్ అందుకున్నాడు. "‘ప్రపంచ ఛాంపియన్‌షిప్ అంటే కేవలం చెస్ మాత్రమే కాదు. ఎంతో మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్యాడీ ఆప్టన్ (మెంటల్ కండీషనింగ్ కోచ్) పాఠాలు చాలా బాగా సాయపడ్డాయి. ఆ సూచనలు, అతనితో చర్చలు ఓ ప్లేయర్‌గా నా పురోగతికి బాటలు వేశాయి" అని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.