World Chess Champion Gukesh :భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగానికి అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే దాదాపుగా ఈ క్రీడలో విదేశీ ప్లేయర్లదే ఆధిపత్యంగా సాగింది. అమెరికా, రష్యా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లు ప్రపంచ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ మన దగ్గర విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే విశ్వ విజేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు ప్రపంచ చెస్ పీఠాన్ని అధిరోహించాడీ ఛాంపియన్. 2000లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్, చివరగా 2012లో ఆ హోదాలో కొనసాగాడు. అయితే 2013లో కార్ల్‌సన్ చేతిలో ఓటమిని చవి చూశాడు. అప్పటి నుంచి భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ కోసం దేశం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలుకుతూ విషీ క్రీడా వారసుడు గుకేశ్ మరోసారి ప్రపంచ చెస్‌లో భారత ఆధిపత్యాన్ని చాటి మన్ననలు పొందుతున్నాడు.
తెలుగు మూలాలున్న కుర్రోడు
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు తెలుగు మూలాలున్నాయి. వాళ్ల పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామం అక్కడ గుకేశ్ అతని ముత్తాతలు ఉండేవారట. అయితే చెన్నైలో స్థిరపడ్డ రజినీకాంత్, పద్మ దంపతులకు 2006లో గుకేశ్ జన్మించాడు. ఇప్పటికీ ఏపీలో వీళ్లకు బంధువులు ఉన్నారు. చిన్నతనంలో గుకేశ్ అక్కడికి వెళ్లేవాడట. గుకేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా తెలుగులో మాట్లాడతారు.
ఇక గుకేశ్ విజయం వెనుక అతని తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉంది. ముఖ్యంగా తన తండ్రి తన కెరీర్‌నే పక్కనపెట్టేసి. తనయుడి కెరీర్ కోసం, అతనితో కలిసి టోర్నీలకు విదేశాలకు వెళ్లేవారట. స్వతహాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన ఆయన 2017-18లో తన కుమారుడి కోసం ఆయన ప్రాక్టీస్ ఆపేశారు. దీంతో మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి సంపాదనతోనే ఆ ఇల్లు గడిచేది. చివరి గేమ్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా తండ్రిని హత్తుకుని గుకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెన్నైలో ఉన్న తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తల్లికొడుకులు భావోద్వేగానికి గురయ్యారు.
చదరంగంపై ప్రేమ - ఎత్తులు వేయడంలో దిట్ట!
గుకేశ్చిన్నప్పటి నుంచే బుద్ధిశాలి. అతడు మహా చలాకీగా ఉండేవాడు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే అతనికి చదరంగంపై ప్రేమ పుట్టింది. క్రమంగా దాన్నే తన కెరీర్‌గా మలుచుకున్నాడు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట అయిన గుకేశ్ ఈ క్రీడపై త్వరగానే పట్టు సాధించిన అండర్-12 ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్‌గా నిలిచాడు. నాలుగో తరగతి తర్వాత పూర్తిగా ఆటపైనే దృష్టి సారించి పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అయితే కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్రకెక్కాడు.