West Indies Shamar Joseph : వెస్టిండీస్‌లోని ఓ మారుమూల గ్రామంలో జీవనం సాగిస్తున్న పేద కుటుంబంలో పుట్టాడతడు. ఐదుగురు పిల్లల్లో ఒకడైన అతడికి క్రికెట్ ఆడాలనే ఆశ పుట్టింది. దీంతో ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ ఎదిగి, తాను కలలు కన్న విండీస్ నేషనల్ టీమ్‌లోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేయడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ కుర్రాడే విండీస్ నయా పేస్ సంచలనం షామర్ జోసెఫ్.
బాడీగార్డ్‌గా : జోసెఫ్ నివసించే గయానాలోని బార్కారా గ్రామంలో టీవీలు పెద్దగా ఉండేవి కావు. ఎప్పుడైనా పాత క్రికెట్ మ్యాచ్‌ల హైలైట్స్ వస్తుంటే వాటిని చూసి ఆనందించేవాడు షామర్. అతడికి వెస్టిండీస్ దిగ్గజ పేసర్లు ఆంబ్రోస్, వాల్ష్‌లను ఫేవరెట్ క్రికెటర్లు. ఎప్పుడైనా బంతి దొరికితే ఆంబ్రోస్, వాల్ష్ స్టైల్లో బౌలింగ్ చేసేందుకు ట్రై చేసేవాడు. కదిరినప్పుడల్లా క్రికెట్ టోర్నీల్లో ఆడుతూ డబ్బులు సంపాదించుకునేవాడు. వాటిని ఇంట్లో ఇచ్చేవాడు కానీ అవి ఏ మూలకీ సరిపోయేవి కావు. దీంతో కోత మిషన్ దగ్గర కూడా అతడు పని చేసేవాడు. అలా ఓ సారి ఓ చెట్టును కొట్టే ప్రయత్నంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కొద్దిలో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడు ఆ పనిని మానేసి బాడీగార్డ్ పనిని ఎంచుకున్నాడు. అలా ఓ వైపు బాడీగార్డ్‌గా పని చేస్తూనే మరోవైపు క్రికెట్‌ను కొనసాగించేవాడు.
అలా మొదలైంది : ఎటువంటి ట్రైనింగ్ లేకుండా వేగంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్న షామర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2023 ఫిబ్రవరిలో గయానా హార్పీ ఈగల్స్ టీమ్ అతడి టాలెంట్‌ను గుర్తించి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని కల్పించింది. అలా అతడు ఈగల్స్ తరఫున 3 మ్యాచుల్లో 9 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 2023 కరీబియన్ ప్రీమయర్ లీగ్‌లో గయానా అమేజాన్ వారియర్స్ తరఫున కూడా ఆడే అవకాశం దక్కింది. ఈ లీగ్‌లోనూ అతడు అదరగొట్టాడు. దీంతో అతడికి గతేడాది దక్షిణాఫ్రికా-ఏ పర్యటనలో భాగంగా వెస్టిండీస్-ఏ జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలా ఇప్పుడు అతడికి ఆస్ట్రేలియాలో పర్యటించే వెస్టిండీస్ సీనియర్ జట్టులో ఛాన్స్ దక్కింది.