Virat Kohli Child Fan :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న అథ్లెట్. విరాట్ మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు స్టేడియంలో, టీవీల్లో ఫ్యాన్స్ అతడి బ్యాటింగ్ చూడడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తాజాగా విరాట్‌ని చూడటానికి ఓ 15ఏళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడు. తన అభిమాన క్రికెటర్‌ని చూసేందుకు సైకిల్‌పై 58 కిలో మీటర్లు ప్రయాణించాడు. కాన్పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు చూసేందకు ఉన్నావ్ (Unnao) నుంచి వచ్చాడు. ప్రస్తుతం ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి పేరు కార్తికేయ. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీని చూసేందుకు తన గ్రామం ఉన్నావ్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ కార్తికేయ కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ పార్క్‌నకు వచ్చాడు. తెల్లవారుజామున 4:00 గంటలకు తన ప్రయాణం ప్రారంభించి, ఉదయం 11:00 గంటలకు స్టేడియానికి చేరుకున్నట్లు వీడియోలో చెప్పాడు. ఇక తాను ఒక్కడినే వెళ్లడానికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు కార్తికేయ తెలిపాడు.
బాలుడికి నిరాశే!
కాన్పూర్‌లో శుక్రవారం వాతావరణం ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో టాస్ నెగ్గిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకొన్నాడు. ఇక విరాట్ బ్యాటింగ్ చూడాలనే కార్తికేయ కోరిక ఈ రోజు నెరవేరలేదు. కాగా, చెన్నైలో ఆడిన జట్టుతోనే భారత్ బరిలో దిగింది.