Tunde Onakoya Chess :ఏక కాలంలో పది మందితో చెస్ ఆడి ఓడించి ఔరా అనిపించాడు ఓ చెస్ ప్లేయర్. అతడే నైజీరియాకు చెందిన టుండే ఒనకోయ(Tunde Onakoya). ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాళ్లోకి వెళితే. నైజీరియాకు చెందిన టుండే ఒనకోయ అనే వ్యక్తి చెస్ ప్లేయర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
అయితే తన ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికే అతడు పరిమితం కాలేదు. 'చెస్ ఇన్ స్లమ్స్' అనే ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. సామాజిక అంతరాలను తగ్గించే క్రమంలో ఈ చెస్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నాడు. ఆటపై మక్కువ ఉన్న చిన్నారులకు తనదైన శైలిలో మెళకువలను నేర్పిస్తున్నాడు. అంతే కాకుండా వారికి జీవిత పాఠాలను నేర్పిస్తున్నాడు. సమస్యలు ఎదురైనపుడు సహనంగా, ఓర్పుగా ఉండి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలను కూడా చెబుతూ సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నాడు.
అయితే తాజాగా అతడు ఫండ్ రైజింగ్‌లో భాగంగా రీసెంట్గా జర్మనీలో నిర్వహించిన చెస్ ఎగ్జిబిషన్‌లో టుండే పాల్గొన్నాడు. అక్కడే ఏకకాలంలో పది మందితో చెస్ ఆడాడు. రెండు గంటల పాటు కొనసాగిన ఆటలో విజేతగా నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియోను టుండే గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.