Travis Head Sunrisers Hyd : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ కొత్తగా కనిపిస్తోంది. ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 4 నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు(ముంబయిపై 277) చేసి, తాజాగా ఆర్సీబీ మ్యాచ్‌లో(287) పరుగులతో రికార్డును తిరగరాసింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాలతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరులు సాధిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అనగానే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ గుర్తొచ్చేవాడు. మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగేవాడు. స్థిరంగా పరుగులు సాధించి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకంగా మారాడు. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత హైదరాబాద్‌కి అలాంటి ఆటగాడు కరవయ్యాడు. రెండు సీజన్ల పాటు ఆ వెలితి కొనసాగింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రాకతో ఆ లోటు తీరిపోయింది.
హెడ్ విధ్వంసం :2022 వేలానికి ముందు వార్నర్‌ను సన్‌రైజర్స్ వదులుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి ప్లేయర్ మళ్లీ దొరుకుతాడా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. మార్‌క్రమ్, మయాంక్, అభిషేక్, హ్యారీ బ్రూక్ ఇలా ఎంత మంది వచ్చినా వార్నర్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఇప్పటికి ట్రావిస్ హెడ్ రూపంలో సన్‌రైజర్స్‌కి నికార్సైన ఓపెనర్ దొరికాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బాదుడే పనిగా చెలరేగిపోతున్నాడు.
ఈ సీజన్‌లో ముంబయితో మ్యాచ్‌లో అడుగుపెట్టిన హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. దీంతో జట్టు రికార్డు స్కోరు 277 సాధించింది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏకంగా 287 పరుగులతో తన రికార్డును తనే అధిగమించింది. ఈ మ్యాచ్‌లో కూడా హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.