Sanju Samson World Cup:ఆటలో లోపం లేదు. ప్రతిభకు కొదువ లేదు. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టీమ్ఇండియా సీనియర్ జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిపోయింది. ఎంతలా అంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏదైనా ముఖ్యమైన సిరీస్ లేదా పెద్ద టోర్నీ కోసం టీమ్ఇండియా జట్టును సెలెక్ట్ చేస్తే అతడి పేరు కచ్చితంగా ఉండాలన్న డిమాండ్ కచ్చితంగా గట్టిగా వినిపిస్తుంది. కానీ చివరి అతడి పేరు కనిపించేది కాదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి పేరు లేకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. కానీ ఇదంతా మొన్నటి వరకు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో సెలక్టర్లు మొండిచేయి చూపకుండా అతడిని ఎంపిక చేశారు. పైగా అతడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫామ్‌లో ఉండడంతో వరల్డ్ కప్‌లోనూ అలానే చెలరేగి ఆడుతాడన్న ఆశలు అందరిలో పుట్టుకొచ్చాయి.
ఈ సారి మాత్రం అలా కాదు: వాస్తవానికి ఐపీఎల్‌లో చాలా సీజన్ల నుంచి శాంసన్ మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఆ తర్వాత నిలకడ తప్పుతుంటాడు. మొదటి నుంచి ఇది ఇలానే కొనసాగుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం అలా కాదు. మధ్యలో ఫామ్ కోల్పోకుండా మొదటి నుంచి నిలకడ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 471 పరుగులు చేశాడు. 67.28 సగటు కాగా స్ట్రైక్ రేట్ 163.54 ఉండటం విశేషం. ఇది చిన్న విషయం కాదనే చెప్పాలి.
పైగా వరల్డ్ కప్‌లో చోటు కన్ఫామ్ అయ్యాక కూడా అతడేమీ రిలాక్స్ అయిపోలేదు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 86 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిటాడు. పాయింట్ల పట్టికలో తన జట్టు రాజస్థాన్ దూసుకెళ్లడానికి ప్రధాన కారణమయ్యాడు. దీంతో వరల్డ్ కప్ ముంగిట శాంసన్ ఇలాంటి ప్రదర్శన కనబరచడం అతడి అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది.