ICC Test Rankings : బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఈయన, గబ్బా టెస్టులో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని ఈ సారి మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఈ వారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 904 రేటింగ్ పాయింట్లతో బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టీమ్ఇండియా బౌలర్‌గా అశ్విన్ రికార్డును ఇప్పుడు బుమ్రా సమం చేశాడు. అయితే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ 2016 డిసెంబరులో ఈ ఘనత సాధించాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు స్థానాలకు దిగజారి 10వ ర్యాంక్‌కు పడిపోయాడు.
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే ఇంగ్లాండ్ బ్యాటర్లు 895 పాయింట్లతో జో రూట్ టాప్‌లో ఉండగా, 876 పాయింట్లతో హ్యారీ బ్రూక్ రెండు స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే 867 రేటింగ్ పాయింట్స్‌తో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉండగా, భారత్‌పై వరుస శతకాలతో విరుచుకుపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 825 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు.
మరోవైపు 805 పాయింట్లతో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కిందకు దిగి ఐదో ర్యాంక్‌కు చేరగా, స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 708 పాయింట్లతో రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. అయితే మరో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రం 652 పాయింట్లతో నాలుగు స్థానాలు పడిపోయి 20వ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ మాత్రం కేవలం ఒక స్థానం దిగజారి 21వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు స్థానాలకు దిగజారి 35వ స్థానానికి పరిమితమయ్యాడు.
ఇక ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా, గురువారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు ప్రారంభం కానుంది.
ఒక్కడే ఎంతని పోరాడతాడు- ఈసారైనా అండగా నిలుస్తారా?
బాక్సింగ్ డే టెస్టు - బుమ్రా, స్మిత్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డులు