Sreesanth IPL:టీమ్ఇండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పూర్వ ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (2011 తర్వాత రద్దైంది) జట్టు ప్లేయర్లకు ఇప్పటికీ కొంత బకాయిలను (ఫీజును) చెల్లించాల్సి ఉందన్నాడు. తనతోపాటు స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, మహేల జయవర్ధనే సహా పలువురు ఆటగాళ్లకు రావాల్సిన డబ్బు ఇంకా అందలేదని తాజాగా పేర్కొన్నాడు. తామంతా కొచ్చి టస్కర్స్ కేరళ యాజమాన్యం బకాయిఉన్న ఫీజుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. పదేపదే జట్టు యాజమాన్యం హామీ ఇస్తున్నా, డబ్బులు అందుతాయో లేదో అనే డైలామాలో ఉన్నామని చెప్పాడు.
'కొచ్చి టస్కర్స్ కేరళ యాజమాన్యం జట్టులోని చాలా మంది ప్లేయర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, మహేల జయవర్ధనే సహా పలువురు క్రికెటర్లకు ఫ్రాంచైజీ నుంచి డబ్బులు అందాలి. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని డబ్బులు చెల్లించేటట్లు చేయాలి. ఏడాదికి 18శాతం వడ్డీతో కలిపి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. సాధారణంగా ఏదైనా ఫ్రాంచైజీ రూల్స్ ప్రకారం 3 ఏళ్లపాటు కొనసాగాలి. కానీ కొచ్చి టస్కర్స్ జట్టు కేవలం ఒక సంవత్సరంలోనే రద్దైంది. ఈ విషయంపై కూడా బీసీసీఐ మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది' అని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓ షోలో వ్యాఖ్యానించాడు.
2011ఐపీఎల్లో కొచ్చి టస్కర్స్ కేరళ, పుణె వారియర్స్ ఇండియా రెండు ఫ్రాంచైజీలు కొత్తగా చేరాయి. అయితే పుణె రెండేళ్లపాటు కొనసాగగా, కొచ్చి ఒక సీజన్లో మాత్రమే ఆడింది. ఈ క్రమంలో కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు ఆకస్మికంగా తన ప్రయాణాన్ని ముగించడంపై కూడా శ్రీశాంత్ పలు వ్యాఖ్యలు చేశాడు. జట్టు రద్దు కారణంగా ప్లేయర్లు ఆర్థిక ఇబ్బందులను భరించాల్సి వచ్చిందని తెలిపాడు.