Rohit Sharma Cricketer Of The Year 2024: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన పురస్కారం అందుకున్నాడు. ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సియట్ (CEAT) క్రికెట్ రేటింగ్స్ అవార్డ్స్ 2024లో ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు దక్కించున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్, మహ్మద్ షమీ వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు. కాగా, సియట్ 26వ ఎడిషన్ అవార్డ్స్ ఈవెంట్ ముంబయిలో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జై షా, ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ పాల్గొన్నారు.
వాళ్ల మద్దతుతోనే
ఈ అవార్డ్స్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తనకెంతో మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. 'జట్టులో మార్పు తేవడం నా కల. గణాంకాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించాలనుకున్నా. ఇందుకోసం మూడు స్తంభాలు జై షా, రాహుల్ ద్రవిడ్, అగార్కర్‌ల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఈ మద్దతు వల్లే నేను చేయాలనుకున్నది చేయగలిగా. ఆటగాళ్లనూ మరువొద్దు. వివిధ దశల్లో జట్టుతో చేరిన వాళ్లు జట్టు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహకరించారు. ఇక భారత్ వరల్డ్‌కప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. అది ప్రతి రోజూ కలిగే అనుభూతి కాదు. విజయాన్ని మేమెంతో ఆస్వాదించాం. ప్రపంచకప్ విజయం మాకెంత ముఖ్యమైందో మొత్తం దేశానికీ అంతే ముఖ్యమైంది. కప్పు గెలిచి ఇక్కడ జనంతో కలిసి సంబరాలు చేసుకోవడం గొప్పగా అనిపించింది. వన్డే, టెస్టు కెప్టెన్‌గానూ మరింత సాధించాల్సింది ఉంది' అని రోహిత్ అన్నాడు.