T20 Worldcup 2024 Rohith Sharma Scolds Rishab Pant :టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఫైర్ అయ్యాడు కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్ 8 దశలో చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడి గెలిచింది రోహిత్ సేన. డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ గేమ్‌లో టీమిండియా 205 పరుగులు నమోదు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్ చివరి బంతికే జట్టుకు శుభారంభాన్ని అందించాడు. డేవిడ్ వార్నర్‌ను ఆరు పరుగులకే పరిమితం చేసి అవుట్ చేశాడు.
ఆ తర్వాతి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ వేస్తుండగా టీమిండియా మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. స్టంప్స్ వెనుక ఉన్న రిషబ్ పంత్ చక్కటి క్యాచ్ వదిలేశాడు. సెకండ్ ఓవర్ నాలుగో బంతిని బుమ్రా లెంగ్తీగా వేయడంతో అది మిచెల్ మార్ష్ మీదుగా వెళ్లింది. ఆ బాల్‌ను ఎదుర్కొనేందుకు భయపడి దానిని పంత్‌కు ఎడమవైపుగా బాదాడు.
అయితే పంత్ చాలా ఈజీగా ఆ క్యాచ్‌ను అందుకోగలడని, రెండో వికెట్ పడిపోయినట్లే అని ఎదురుచూసిన అందరినీ నిరాశపరిచాడు. పంత్ ముందుకు అడుగేయబోయి కిందపడ్డాడు. అలా క్యాచ్ అందుకోలేకపోవడంతో బంతి సేఫ్ ల్యాండింగ్ అయింది. రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు దక్కుతున్నాయని ఆశించి, చేతికి చిక్కిన అవకాశం సులువుగా చేజారిపోవడంతో ఫైర్ అయిన రోహిత్ శర్మ రిషబ్ పంత్‌ను తిట్టిపారేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
మ్యాచ్ అనంతరం విజయంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ - "పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం చాలా కలిసొస్తుంది. మేం నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యం మాలో కాన్ఫిడెన్స్ పెంచింది. సమయానికి తగ్గట్లుగా వికెట్లు తీయగలిగాం. కుల్దీప్ జట్టుకు బలమే కానీ, తన అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆడించాలి. ఈ టోర్నీలో అతను చేయాల్సింది చాలా ఉంది. పిచ్‌లకు తగ్గట్లుగా బౌలర్లు ఎంపిక ఉంటుంది. మార్పులేమీ లేకుండానే తర్వాతి మ్యాచ్ అయిన ఇంగ్లాండ్‌తో కూడా ఇలాగే ఆడాలనుకుంటున్నాం. సెంచరీ, హాఫ్ సెంచరీలు నాకు పెద్ద విషయం కాదని గత మ్యాచ్‌లోనే చెప్పాను. నా వరకూ జట్టుకు అవసరమైనప్పుడు షాట్‌లు ఆడి బౌలర్లపై ఒత్తిడి పెంచాలి. తర్వాతి షాట్ ఎటువైపు వెళ్తుందో అనే భయాన్ని కలిగిస్తూ అన్ని ఏరియాల్లో కవర్ చేయాలి. అదే నేను ఈ రోజు చేశాను" అని పేర్కొన్నాడు.