T20 Worldcup 2024 Final Teamindia VS SouthAfrica : టీ20 ప్రపంచకప్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమే ఎరుగని భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా నెగ్గని టీమిండియా ఈసారి ఆ లోటు భర్తీ చేసుకోవాలని కోరుకుంటోంది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రోఫీని ముద్దాడాలని కృతనిశ్చయంతో ఉంది. కరీబియన్ పిచ్‌లకు తగ్గట్లు తమ ఆటతీరు మలచుకున్న భారత క్రికెటర్లు ఈ టోర్నీలో సత్తా చాటుతున్నారు. 2007లో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు గత పదేళ్లలో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
Teamindia Batting : తుదిపోరులో కూడా సెమీస్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓపెనర్ విరాట్‌కోహ్లీ పేలవఫామ్ భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెలరేగి ఆడిన కోహ్లీ టీ20 ప్రపంచకప్‌కు వచ్చే సరికి తేలిపోయాడు. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 10.71 సగటుతో కోహ్లీ కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సెమీస్ ముగిసిన తర్వాత మాట్లాడిన రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ తప్పనిసరిగా ఉంటాడని స్పష్టం చేశాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్ అని ఫామ్ అతనికి సమస్యకాదని రోహిత్ అన్నాడు. తన శక్తినంతా ఫైనల్ కోసం కోహ్లీ దాచిపెట్టాడేమోనన్న రోహిత్ తుది పోరులో కోహ్లీ తప్పకుండా కీలక ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసివచ్చే అంశం. టోర్నీలో రోహిత్ శర్మ 3, సూర్యకుమార్ యాదవ్ 2 అర్థశతకాలను నమోదు చేశారు. ఫైనల్‌లో వీరు అదే దూకుడు ప్రదర్శించాలని భారత జట్టు కోరుకుంటోంది. ఐపీఎల్‌లో స్పిన్ బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించి మిడిల్ ఆర్డర్‌లో చోటు దక్కించుకున్న శివమ్ దూబే టీ20 ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ఒత్తిడి ఎక్కువగా ఉండే తుదిపోరులో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, షమ్సీని దూబే ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Teamindia Bowling :బౌలింగ్ విభాగంలో భారత్‌కు పెద్దగా సమస్యలేమీ లేవు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ సత్తా చాటుతుండగా హర్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. స్పిన్ బౌలింగ్‌తో కులదీప్ యాదవ్, అక్షర్‌పటేల్, రవీంద్ర జడేజా రాణిస్తున్నారు. అమెరికాలో జరిగిన గ్రూప్‌దశ మ్యాచ్‌ల్లో తుదిజట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడిన భారత జట్టు స్పిన్‌కు అనుకూలించే కరీబియన్ పిచ్‌లపై జరిగిన సూపర్-8 మ్యాచ్‌ల్లో వ్యూహాన్ని మార్చింది. సిరాజ్ బదులు కులదీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం కలిసివచ్చింది. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి టోర్నీ. కరీబియన్‌లో జరిగిన 2007 వన్డే వరల్డ్‌కప్‌లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో బరిలోకి దిగిన భారత జట్టు గ్రూప్ దశలోనే వైదొలిగి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన ట్రోఫీని నెగ్గి ద్రవిడ్‌కు గ్రాండ్ ఫేర్‌వెల్ ఇవ్వాలని భారత క్రికెటర్లు భావిస్తున్నారు.
T20 Worldcup 2024 SouthAfrica : మరోవైపు ఫైనల్లో భారత ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో సఫారీలు కూడా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడమే దక్షిణాఫ్రికా నెగ్గిన ఏకైక ఐసీసీ ట్రోఫీ. ఓపెనర్లు క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్ రాణించాలని ఆ జట్టు కోరుకుంటోంది. సూపర్-8 మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ పెద్దగా రాణించలేదు. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపుపొందిన హెన్రిచ్ క్లాసెన్ కూడా పూర్తిస్థాయిలో సత్తా చాటాల్సి ఉంది. జోరుమీదున్న దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ విభాగం భారత్‌పై ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది. స్పిన్ బౌలింగ్ విభాగంలో షమ్సీ, కేశవ్ మహారాజ్ సఫారీలకు అండగా ఉన్నారు. ఫైనల్ జరిగే శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐతే ఐసీసీ రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది. భారత కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు ఆరంభంకానుంది.
కోచ్‌గా ద్రవిడ్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్- 17ఏళ్ల కల నెరవేరేనా? - Rahul Dravid Last Day Coach
భారత్ 11ఏళ్లు, సౌతాఫ్రికా 26ఏళ్లు- రెండు జట్లదీ ఒకే పరిస్థితి! - T20 World Cup 2024 Final