T20 World Cup Hat Tricks:2024 టీ20 వరల్డ్‌కప్‌లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికా వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో అనేకసార్లు అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. కానీ, బౌలర్లు మాత్రం మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం గమనార్హం. ఆసీస్ స్టార్ పేసర్ అత్యధికంగా రెండుసార్లు, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డన్ ఈ ఫీట్ సాధించారు. మరి ఇప్పటివరకు జరిగిన 9 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో ఎన్ని హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి? ఈ హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు? తెలుసుకుందాం.
2024లో కమిన్స్ డబుల్ హ్యాట్రిక్
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ వరుసగా రెండు సార్లు హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. తొలుత బంగ్లాదేశ్, తర్వాత అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తంగా 9 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అందులో కమిన్స్‌వే రెండు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ టీ20ల్లో కమిన్స్ రెండు హ్యాట్రిక్స్ తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. కమిన్స్ కంటే ముందు లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌథీ (న్యూజిలాండ్), మార్క్ పాల్వోవిక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (మాల్టా) ఉన్నారు.
అమెరికాపై జోర్డాన్
సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్ 2లో ఇంగ్లాండ్- యూఎస్‌ఏ మ్యాచ్‌లో జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. 19 ఓవర్లో మొదట బంతికి కోరె అండర్సన్, హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రెండో బాల్‌కి పరుగులు రాలేదు. తర్వాత మూడు బంతులకు వరుసగా అలీ ఖాన్ (0) క్లీన్‌బౌల్డ్, నోస్తుష్ కెంజిగే (0) ఎల్బీడబ్ల్యూ, నేత్రావల్కర్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో హ్యాట్రిక్ కావడం గమనార్హం.