T20 Worldcup 2024 Final Rain :ఐసీసీ టోర్నమెంట్ అయిన టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అజేయంగా ఫైనల్ మ్యాచ్ వరకూ చేరుకుంది. ఇప్పటివరకు ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఓటమి లేకుండా ఫైనల్ చేరుకోవడం ఇది మూడో సారి. ఈ సారి ఫైనల్ గెలిచి రెండో సారి ట్రోఫీని ముద్దాడాలని టీమిండియా ఆశగా ఎదురుచూస్తుంది. 2007లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో తొలిసారి ట్రోఫీని గెలవగా ఆ తర్వాత ఫైనల్ వరకూ వెళ్లినా గెలవలేకపోయింది. ఈ సారి మాత్రం ఫైనల్ గెలవాలంటే ప్లేయర్ల పెర్ఫార్మెన్స్‌తో పాటు వర్షంపై కూడా ఆధారపడి ఉంది.
ఇప్పటికే పలుమార్లు ఈ టోర్నమెంట్లో అంతరాయం కలిగించిన వరుణుడు ఇండియా ఆడిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జాలి చూపించాడు. దీంతో ఇంగ్లాండ్‌పై భారత జట్టు విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇప్పుడు వాతావరణ నిపుణులు చెప్పిన రిపోర్ట్ ప్రకారం బార్బడోస్ వేదికగా శనివారం జరగబోతున్న మ్యాచ్‌కు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందట.
బార్బడోస్ వాతావరణ నివేదిక -శనివారం జూన్ 29న ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయట. అక్కడి స్థానిక సమయం ప్రకారం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. ఈ కారణంగానే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తుంది. అయితే వర్షం పడే అవకాశాలు 30 శాతం వరకూ తగ్గినప్పటికీ మధ్యాహ్నం 1 లేదా 2 గంటల సమయంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది.
ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా వాషౌట్ అయితే -ఈ ఫైనల్ మ్యాచ్ వర్షం పడి రద్దైతే రిజర్వే డే ఉంది. నేడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ మొదలై ఆగిపోతే ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆదివారం ఆటను తిరిగి కొనసాగిస్తారు. అదే శనివారం టాస్ పడ్డాక వర్షం వల్ల మ్యాచ్ ప్రారంభం అవ్వకపోతే మళ్లీ రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కూడా కేటాయించింది. ఈ అదనపు సమయం మ్యాచ్ జరగాల్సిన రోజుతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తుంది. అదే రిజర్వ్‌డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విన్నర్‌ను అనౌన్స్ చేయాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు అయినా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.