T20 World Cup 2024 America :ఐసీసీ వరల్డ్ కప్ 2024కి అమెరికా, కరేబియన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ ప్రారంభంలో మొదలు కానుంది. ఇప్పటికే ఆయా దేశాలు సన్నాహాలు ప్రారంభించాయి. ఏప్రిల్ చివరి వారంలో బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఏ ఆటగాళ్లకు అమెరికా ఫ్లైట్ ఎక్కే అవకాశం వస్తుందా? అని ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అలానే క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని అమెరికాలో టీ20 వరల్డ్ కప్ ఎందుకు జరుగుతోంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అమెరికా క్రీడల చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే.
ఒకప్పుడు, క్రికెట్ అమెరికా నేషనల్ గేమ్ అని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే ఒకప్పుడు అమెరికాలో క్రికెట్ చాలా పాపులర్. కానీ సమయం గడిచేకొద్దీ, అది మరుగున పడిపోయింది, బేస్ బాల్, ఫుట్‌బాల్‌కు క్రేజ్ పెరిగింది. అమెరికాలో క్రికెట్ ప్రయాణం 1751లో ప్రారంభమైంది. దేశాభివృద్ధితోపాటు క్రీడా ప్రాధాన్యతలు కూడా పెరిగాయి. ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్‌లు, వేగవంతమైన జీవనశైలికి బోరింగ్‌గా తోచాయి. మరో వైపు బేస్‌బాల్ తక్కువ సమయంలో పూర్తవుతుండటం, రూల్స్ ఈజీగా ఉండటంతో క్రమంగా పాపులర్ అయింది.
వీటికితోడు అమెరికన్ సివిల్ వార్, రెండు ప్రపంచ యుద్ధాల వైరుధ్యాలతో క్రికెట్ మరుగునపడింది. బేస్‌బాల్ అమెరికా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది. నేషనల్ లీగ్ వంటి ప్రొఫెషనల్ లీగ్‌ల ఆవిర్భావంతో అమెరికాలో బేస్ బాల్ స్థానం బలపడింది. క్రికెట్ క్రమంగా వెనకబడింది.
సాకర్, టెన్నిస్ ముందు తేలిపోయిన క్రికెట్
సాకర్, టెన్నిస్ వంటి ఇతర క్రీడలు అమెరికన్ స్పోర్ట్స్‌లో తమకంటూ స్థానం సంపాదించుకున్నాయి. కానీ క్రికెట్ ప్రభావం తక్కువైపోయింది. పాఠశాలలు, కళాశాలల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, బేస్‌బాల్, ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ ముందు క్రికెట్ ఆకర్షించలేకపోయింది.
అయితే, ప్రస్తుతం అమెరికాలోని క్రికెట్ ఔత్సాహికులకు మంచి రోజులు వచ్చాయి. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 నిర్వహించేందుకు సిద్ధమైంది. వేగవంతమైన T20 ఫార్మాట్ ద్వారా అమెరికన్ క్రీడారంగంలో క్రికెట్‌కు సముచిత స్థానాన్ని కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
టీ20 ఎంటర్‌టైన్‌మెంట్‌పై నమ్మకం
USలో జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణనీయమైన సంఖ్యలో ఉన్న సౌత్ ఆసియన్ల సహా మిలియన్ల మంది క్రికెట్ ప్రేమికుల ఉనికి, అమెరికన్ ప్రేక్షకులను ఆకర్షించగలదని భావిస్తున్నారు. బాస్కెట్‌బాల్, టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడల నుంచి క్రికెట్ కఠిన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, చిన్న ఆశతో ప్రయత్నాలు చేపడుతున్నారు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ సంపాదించిన క్రేజ్ అమెరికన్లను ఆకర్షించగలదని భావిస్తున్నారు. క్రికెట్ ఔత్సాహికులు ఆశను కలిగి ఉన్నారు. పట్టుదల, ప్యాషన్‌తో క్రికెట్ మరోసారి అమెరికన్ల హృదయాల్లో సముచిత స్థానాన్ని తిరిగి పొందుతుందని విశ్వసిస్తున్నారు.