T20 Womens World Cup 2024 :బంగ్లాదేశ్‌లో మొదలైన సంక్షోభంతో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని ఐసీసీ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 టోర్నీ నిర్వహించాలని భారత బోర్డుని ఐసీసీ సంప్రదించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. కొన్ని ప్రధాన కారణాల వల్ల టోర్నీ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారత్‌లో వర్షాకాలం నడుస్తోంది. ఈ సమయంలో టోర్నీని నిర్వహించడం చాలా కష్టం. ముఖ్యంగా ప్లేయర్‌ల ట్రావెలింగ్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. అలానే భారతదేశం వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెంట వెంటనే రెండు వరల్డ్ కప్‌లు నిర్వహించడం అసాధ్యం. ఈ రెండు ప్రధాన కారణాలతో టీ20 మహిళల ప్రపంచ కప్ నిర్వహణకు ముందుకు రాలేదని జై షా స్పష్టం చేశారు.
టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది?
భారతదేశం బయటకు రావడంతో ఇప్పుడు శ్రీలంక, యూఏఈ రేస్‌లో ఉన్నాయి. ఆతిథ్య దేశంపై ఆగస్టు 20న ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
బంగ్లాదేశ్‌లో నిరసనలు
వాస్తవంగా టీ20 మహిళల వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అక్కడ మొదలైన రాజకీయ సంక్షోభం, నిరసనల నేపథ్యంలో ఐసీసీకి ప్రత్యామ్నాయం అవసరమైంది. టోర్నమెంట్‌ని సజావుగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆటగాళ్ల శ్రేయస్సు దృష్ట్యా ICC ఈవెంట్‌ను మరో చోటుకు మార్చాలని నిర్ణయించింది.