Sunrisers IPL Highest Score:2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం సృష్టించింది. సోమవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102 పరుగులు, 41 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక హెన్రీచ్ క్లాసెన్ (67 పరుగులు, 31 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. చివర్లో ఎయిడెన్ మార్క్రమ్ (32 పరుగులు, 17 బంతుల్లో), అబ్దుల్ సమద్ (37 పరుగులు, 10 బంతుల్లో) ఆర్సీబీపై దాడి చేశారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ తమ రికార్డు (277-3) తామే బద్దలుకొట్టింది. ఇదే సీజన్లో సన్‌రైజర్స్ ముంబయిపై ఈ స్కోర్ సాధించింది.
మెరుపు శతకం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (34 పరుగులు, 22 బంతుల్లో) ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు. వీరి దెబ్బకు 8 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. అయితే 8.1 వద్ద టోప్లే అభిషేక్‌ను పెవిలియన్ చేర్చి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. దీంతో తొలివికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఇక హెడ్‌కు క్లాసెన్ జతకలవడం వల్ల చిన్నస్వామిలో సునామీ వచ్చినట్లైంది. వీరిద్దరూ పోటాపోటీగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించారు.
ఈ క్రమంలోనే హెడ్ ఐపీఎల్లో నాలుగో వేగవంతమైన (39 బంతుల్లో) సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత హెడ్‌ను ఫెర్గ్యూసన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మర్‌క్రమ్‌తో క్లాసెన్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తైన తర్వాత క్లాసెన్ పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ రెచ్చిపోయాడు. దీంతో తమ జట్టు రికార్డ్‌ను తామే బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో లాకీ ఫెర్గ్యూసన్ 2, టొప్లే 1 వికెట్ దక్కించుకున్నారు.