Sunrisers Hyderabad IPL 2024:ఐపీఎల్లో ఒకప్పుడు 130- 170 స్కోర్లను డిఫెండ్ చేసి కాపాడుకునే సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్లో ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సార్లు 260+ స్కోర్లు నమోదు చేసి తమ బాదుడు గాలివాటం కాదని నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ దెబ్బకు ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్ టీ20 రికార్డులు సైతం బద్దలవుతున్నాయి. సన్‌రైజర్స్ 150 పరుగులు బాదితే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈజీగా 200 క్రాస్ చేస్తోంది.
నాయకత్వం: ఒకప్పుడు సన్‌రైజర్స్ ప్లేయర్లు క్రీజులో కాస్త ఇబ్బందిగా కనిపించేవారు. డేవిడ్ వార్నర్ రాకతో కాస్త రూటు మార్చి పలు విజయాలు నమోదు చేసినా, అతడు జట్టును వీడిన తర్వాత మళ్లీ పాత కథే అయ్యింది. గత మూడు సీజన్లు ప్రత్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. అయితే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ దశ మారింది. ఈ సీజన్లో ఆట దూకుడూగా ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందే కెప్టెన్ ముందుగానే ప్రత్యర్థులను హెచ్చరించాడు. ఇప్పుడు అది చేతల్లో చూపిస్తున్నాడు.
ప్రతీ ప్లేయర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో క్రీజులో అడుగుపెడుతున్నారు. వచ్చీ రావడంతోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఎలాంటి దిగులు లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. అందువల్లే జట్టు భారీ స్కోర్లు నమోదు చేయగలుగుతుంది. అటు బౌలింగ్‌లోనూ పరుగులు భారీగా సమర్పించుకున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కెప్టెన్ కమిన్స్ సన్‌రైజర్స్ గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేశాడు. ఎటాకింగ్ గేమ్‌తో పాజిటివ్ ఫలితాలు అందుకుంటున్నాడు.