Rajiv Swagruha Flats Auction : రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్ధం అవుతోంది. దశల వారీగా వాటిని విక్రయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. తొలిదశలో గ్రేటర్ పరిధిలో నివాసానికి సిద్ధంగా ఉన్న 760 ఫ్లాట్లను విక్రయించాలని భావించారు. అందుకు అధికారులు రూపొందించిన దస్త్రానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. అయితే తొలుత బండ్లగూడలో 159, పోచారంలో 601 ఫ్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు.
రెండో దశలో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయిన బహుళ అంతస్తుల అపార్టుమెంట్లను అమ్మనున్నారు. పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్‌లో 28 టవర్స్‌లోని పెద్ద సంఖ్యలో ఫ్లాట్లు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. వాటిని వేలం ద్వారా బిల్డర్స్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల విక్రయ ప్రక్రియ పూర్తైన తరవాత టవర్స్ వేలం వేయాలని ప్రభుత్వం యోచనలో ఉంది.
విక్రయాల ద్వారా రూ.800 కోట్లు అంచనా : ఈ రెండు దశల విక్రయాలతో ఆదాయం రూ.800 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బండ్లగూడలోని 159 ఫ్లాట్ల ద్వారా రూ.30 కోట్లు, పోచారంలోని 601 ఫ్లాట్ల ద్వారా రూ.98 కోట్లు గడించవచ్చని సర్కారుకు పంపిన ప్రతిపాదనల్లో తెలిపారు. అసంపూర్తిగా ఉన్న టవర్స్ విక్రయం ద్వారా మరో రూ637 కోట్లు పొందవచ్చని అనుకుంటున్నారు.
బిల్డర్స్‌కు అప్పగించే యోచనలో ప్రభుత్వం : రాజీవ్ స్వగృహ పథకం కింద అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, ఖాళీ స్థలాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సుమారు ఏడాదిన్నర కిందట ఒకదఫా అమ్మగా సుమారు రూ.1,800 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. అసంపూర్తిగా ఉన్న అపార్ట్‌మెంట్స్(టవర్స్)ను పూర్తి చేసి విక్రయించుకునేందుకు ముందుకు వచ్చే బిల్డర్స్‌కు మాత్రమే వేలంలో అప్పగించాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ పరిధిలో ఉన్న అన్ని ఫ్లాట్ల ద్వారా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తొలి విడతలో వేలం ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డబ్బులు : అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించి భూములను బదలాయించింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి అమ్మింది. అప్పట్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, స్థలాలు మిగిలిపోయాయి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్థలాల, నిర్మాణాల ఎలా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నతస్థాయి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలు ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. వాటిపై సమీక్షించిన అనంతరం దశల వారీగా విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇళ్లు, భూములు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్ - రాజీవ్ స్వగృహ ఇళ్లు, భూముల వేలం ఎప్పటినుంచో తెలుసా?