Sri Lanka Vs West Indies 3rd T20 : సొంతగడ్డపై తాజాగా శ్రీలంక జట్టు మెరుపులు మెరిపించింది. దంబుల్లా వేదికగా తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆ జట్టు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విండీస్ సేనను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో ఆధిక్యంతో లంక చేజిక్కించుకుంది.
మ్యాచ్ సాగిందిలా :
టాస్ గెలిచిన విండీస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. కెప్టెన్ రావ్‌మన్ పావెల్(37)మాత్రమే ఈ జట్టు నుంచి టాప్ స్కోరర్‌గా నిలవగా, గుడకేశ్ మోతీ (32), కూడా మంచి స్కోర్‌ను అందించి జట్టును ముందుకు నడిపించాడు. మిగిలిన వారందరూ ఇన్నింగ్స్ నిర్మించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఇక లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక విండీస్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు 18 ఓవర్లలో ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి సాధించింది. స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (68*) అర్థశతకంతో రాణించగా, కుశాల్ పెరీరా (55*) కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఈ ఇద్దరితో పాటు పాతుమ్ నిసాంక (39) అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఇదిలా ఉండగా, ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.