Highest Earning Cricketers In 2025 :2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెండు గ్రూపులుగా 8 దేశాలు తలపడుతున్నాయి. విజేత ఎవరో తెలియాలంటే మార్చి 9 వరకు ఆగాలి. ఇంతకీ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో తెలుసా? ఐపీఎల్‌లో కొందరు ప్లేయర్‌లు అందుకుంటున్న ఫీజు కంటే కూడా చాలా తక్కువ. ఆశ్చర్యంగా ఉందా! ఛాంపియన్స్ ట్రోపీ విజేతకు 2.24 మిలియన్ డాలర్లు (రూ.19.41 కోట్లు) లభిస్తాయి. రన్నరప్‌కు 1.12 మిలియన్ డాలర్లు (రూ.9.70 కోట్లు) అందుతాయి. ఈ ప్రైజ్ మనీ కంటే ఐపీఎల్‌లో కొందరు ఆటగాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. వారిలో కొందరు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడకపోవడం గమనార్హం.
- రిషబ్ పంత్ :గత వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధర అందుకున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు రిషబ్‌ను కొనుగోలు చేసింది. దీంతో పంత్ ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
- శ్రేయాస్ అయ్యర్ :శ్రేయాస్ అయ్యర్ 2024లో కేకేఆర్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు. 2025లో వేలంలో పాల్గొన్నాడు. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు అయ్యర్‌ను దక్కించుకుంది.
- వెంకటేష్ అయ్యర్ :గత వేలంలో వెంకటేష్ అయ్యర్ అనూహ్య ధర పలికాడు. 2024 సీజన్‌లో కేకేఆర్ తరఫున 46.25 యావరేజ్‌తో 370 పరుగులు చేశాడు. మూడో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2025 వేలంలో అతడి కోసం అనేక ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి కేకేఆర్ రూ.23.75 కోట్లకు వెంకటేష్‌ను సొంతం చేసుకుంది.
- హెన్రిచ్ క్లాసెన్ :2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున క్లాసెన్ అదరగొట్టాడు. దీంతో సన్‌రైజర్స్ అతడిని మెగా వేలంలో అట్టిపెట్టుకుంది. ఏకంగా రూ.23 కోట్లు చెల్లిస్తోంది.
- విరాట్ కోహ్లీ :ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. 2025లో విరాట్ మళ్లీ ఆర్‌సీబీ కెప్టెన్సీ స్వీకరిస్తాడని చాలా మంది భావించారు. కానీ మేనేజ్‌మెంట్ రజత్ పాటిదార్‌ని సారథిగా ప్రకటించింది. గత వేలంలో ఆర్‌సీబీ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది.
- నికోలస్ పూరన్ :వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అతడిని రిటైన్ చేసుకోవడానికి రూ.21 కోట్లు ఆఫర్ చేసింది.