Shoaib Malik Match Fixing:పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్‌కు షాక్ తగిలింది. బంగ్లాదేశ్ డొమెస్టిక్ టోర్నమెంట్ (Bangladesh Premier League 2024)లో ఆడుతున్న షోయబ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షోయబ్, 'మ్యాచ్ ఫిక్సింగ్'కు (Match Fixing) పాల్పడ్డాడనే అనుమానంతో ఆ ఫ్రాంచైజీ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అయితే షోయబ్ ఈ టోర్నీకి బ్రేక్ ఇచ్చి రీసెంట్గా పాక్‌కు వెళ్లాడు. అంతలోనే అతడి కాంట్రాక్ట్ రద్దవడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే? ఈ టోర్నీలో భాగంగా జనవరి 22న ఖుల్నా టైగర్స్- ఫార్చ్యూన్ బరిషల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి పవర్‌ప్లేలో బౌలింగ్ చేసిన షోయబ్ మాలిక్ ఒక ఓవర్లో వరుసగా మూడు 'నో బాల్' వేశాడు. దీంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. అయితే ప్రస్తుత క్రికెట్లో నో బాల్స్ చాలా అరుదుగా నమోదవుతున్నాయి. నో బాల్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీ హిట్ రూపంలో అదనపు లాభం ఉండడం వల్ల బౌలర్లు ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్ బౌలర్ షోయబ్ ఒకే ఓవర్లో మూడుసార్లు నో బాల్ వేయడం వల్ల అనుమానాలకు దారితీసింది. దీంతో షోయబ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానంతో బరిషల్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
స్పందించిన షోయబ్:తనపై వస్తున్న ఫిక్సింగ్ వార్తలపై షోయబ్ స్పందించాడు.'నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. బీపీఎల్ నుంచి తప్పుకోవడంపై నా మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఫార్చ్యూన్ బరిషల్ ఫ్రాంచైజీ నా కాంట్రాక్ట్ రద్దు చేయలేదు. నేను మా కెప్టెన్‌తో టచ్‌లోనే ఉన్నా. ముందుగా చేసుకున్న షెడ్యూల్ కారణంగా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. నేను ఫార్చ్యూన్ బరిషల్ జట్టుతోనే కొనసాగుతున్నా. ప్రస్తుతం మా జట్టు బాగా ఆడుతోంది. తదుపరి మ్యాచ్‌ల్లో మా జట్టుకు నా అనసరం ఉంటే నేను కచ్చితంగా ఆడతాను. దయచేసి అబద్దాలు ప్రచారం చేయకండి' అని చెప్పాడు.