Telangana Sankranti Special Recipes : తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సరదాల సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ పండక్కి వారం ముందు నుంచే తెలుగు లోగిళ్లలో పిండి వంటల హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పెషల్ పిండి వంటకమైన సకినాలను తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంటారు మహిళలు. అలాగే, కొందరు బియ్యప్పిండితో మురుకులు చేసుకోవాలనుకుంటారు. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. కానీ, చాలా మందికి అవి అంత పర్ఫెక్ట్గా కుదరవు. అలాంటి వారు ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి. కరకరలాడుతూ టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సకినాలు :
కావాల్సిన పదార్థాలు :
- 8 కప్పులు - బియ్యం
- 1 కప్పు - నువ్వులు
- 6 చెంచాలు - వాము
- తగినంత - ఉప్పు
- వేయించడానికి సరిపడా - ఆయిల్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత నీళ్లు వడకట్టి ఒక శుభ్రమైన క్లాత్ మీద పలుచగా పరచి కనీసం 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. నీరంతా పోయి కాస్త తడిగా ఉన్నప్పుడు గిర్నీకి తీసుకెళ్లి పిండి పట్టించి తెచ్చుకోవాలి.
- ఆ తర్వాత పట్టించుకున్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్)లో జల్లించుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని జల్లించుకున్న పిండిలో వేసుకోవాలి. అలాగే వాము, తగినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మురుకుల పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ కాటన్ క్లాత్‌ను తడిపి పలుచగా పరచి కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకుని వేళ్లతో పొడువుగా తిప్పుతూ మూడు లేదా నాలుగు చుట్లుగా చుట్టాలి. ఆవిధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. తర్వాత వాటిని కాసేపు ఆరనివ్వాలి.
- ఆలోపు స్టౌపై కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సకినాలను వేసుకొని దోరగా కాలనిచ్చి తీసేయాలి.
- చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "తెలంగాణ స్పెషల్ సకినాలు" రెడీ!
- అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి.
- కాబట్టి, ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే జంతికల గొట్టంలో స్టార్ గుర్తు ఉన్న బిళ్లను వేసి లోపల కొద్దిగా ఆయిల్ రాసి పిండి ముద్దను ఉంచి సకినాల షేప్‌లో ఒత్తుకున్నా సరిపోతుంది.
ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్ టేస్ట్‌తో పొంగుతూ, సాఫ్ట్‌గా వస్తాయి!
బియ్యప్పిండి మురుకులు :
కావాల్సిన పదార్థాలు :
- 3 కప్పులు - బియ్యప్పిండి
- 1 కప్పు - పుట్నాలపప్పు పొడి
- 2 చెంచాలు - కారం
- 1 చెంచా - వాము
- తగినంత - ఉప్పు
- 2 కప్పులు - వాటర్
- వేయించడానికి సరిపడా - నూనె
తయారీ విధానం :
- ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్)లో బియ్యప్పిండి, పుట్నాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- ఆపై అందులో కారం, వాము కూడా వేసి బాగా కలుపుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక చిన్న పాత్రలో వాటర్ తీసుకొని అందులో రెండు చెంచాల నూనె వేసి బాగా మరిగించాలి.
- ఆవిధంగా మరించుకున్నాక ఆ నీటిని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమంలో పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చల్లారనివ్వాలి.
- పిండి చల్లారిన తర్వాత గట్టిగా అయినట్లనిపిస్తే కొద్దిగా చల్లటి నీరు యాడ్ చేసుకొని మృదువుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని లోపల కాస్త నూనె అప్లై చేసి కొద్దిగా పిండిని అందులో పెట్టి రెండుమూడు వరుసలు వచ్చేలా జంతిక ఆకారంలో ఒక శుభ్రమైన క్లాత్‌పై ఒత్తుకోవాలి.
- అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మురుకులను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈవిధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
- చల్లారాక వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలు. అంతే, కరకరలాడుతూ నోరూరించే "బియ్యప్పిండి మురుకులు" రెడీ!
సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు!