How to Make Bellam Sunnundalu at Home: సరదాల సంక్రాంతికి సమయం ఆసన్నమైంది. పండక్కి వారం ముందు నుంచే తెలుగు లోగిళ్లన్నీ పిండి వంటలతో ఘుమఘుమలాడుతాయి. సకినాలు, అరిసెలు, అప్పాలు, జంతికలు, నువ్వుల లడ్డూలు, కారం బూందీ ఇలా ఎన్నో రకాల పిండి వంటలు సిద్ధం చేస్తారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా సున్నుండలు కూడా చేస్తుంటారు. అయితే, కొద్దిమంది అద్దిరిపోయే రుచితో వీటిని తయారు చేస్తే, కొందరికి ఎన్ని సార్లు చేసినా పర్ఫెక్ట్గా కుదరవు. అలాంటి వారు సంక్రాంతి వేళ ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా సూపర్ టేస్టీగా వస్తాయి. పైగా ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- మినప గుండ్లు - ఒకటిన్నర కప్పు
- పొట్టు మినపప్పు - అర కప్పు
- బియ్యం - 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం తురుము - 2 కప్పులు
- నెయ్యి - ముప్పావు కప్పు
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మినప గుండ్లు, పొట్టు మినపప్పు వేసి మంచి వాసన వచ్చేవరకు లేదా పప్పు లైట్‌గా రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి.
- ఇలా పప్పు వేగిన తర్వాత బియ్యం వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. బియ్యం వేయడం వల్ల సున్నుండలు తింటున్నప్పుడు నాలుకకు అంటుకోకుండా ఉంటాయి.
- పప్పు, బియ్యం పూర్తిగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అవి చల్లారిన తర్వాత మిక్సీజార్ తీసుకుని కొద్దికొద్దిగా మినపప్పు వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని మరో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న మినపప్పు మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలోకి బెల్లం తురుము వేసి చేతితో బాగా కలపాలి.
- ఆ తర్వాత మరోసారి ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్ తీసుకుని బెల్లం, మినపప్పు పొడి కలిపిన మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నెయ్యి కరిగించుకోవాలి.
- నెయ్యి కరిగిన తర్వాత దింపి మినపప్పు, బెల్లం మిశ్రమంలో కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుతూ సున్నుండలుగా చుట్టుకోవాలి. ఇలా నెయ్యి మొత్తాన్ని పోసుకుంటూ పిండిని సున్ని ఉండలుగా చేసుకోవాలి.
- లేదంటే నెయ్యి మొత్తాన్ని మినపప్పు, బెల్లం మిశ్రమంలో పోసి కలిపి ఉండలుగా చుట్టుకున్న పర్వాలేదు. అంతే ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే బెల్లం సున్నుండలు రెడీ. నచ్చితే మీరూ ఈ పండక్కి ట్రై చేయండి.
సంక్రాంతికి ఇల్లు క్లీన్ చేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే శుభ్రం చేయడం వెరీ ఈజీ!
మైదాపిండి చెగోడీలు ఆరోగ్యానికి హానికరం - ఇలా బియ్యప్పిండితో చేస్తే హెల్దీ అండ్ టేస్టీ!