Shoaib Akhtar Baby:పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ అక్తర్- రుబాబ్ ఖాన్ దంపతులు తమ మూడో బిడ్డను ఆహ్వానించారు. ఆయన సతీమణి రుబాబ్ ఖాన్ శుక్రవారం (మార్చి1) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్తర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇదివరకే ఈ దంపతులకు మహ్మద్ మికైల్ అలీ (2016), మహ్మద్ ముజాద్దీద్ అలీ (2019) అనే ఇద్దరు కుమారులున్నారు.
'మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీలకు తోడుగా ఇప్పుడు ఓ చిన్నారి చెల్లెలు వచ్చింది. ఆ అల్లా మాకు పండంటి ఆడబిడ్డను ప్రసాదించారు. 1445 AH షాబాన్ 19న (ఉర్తూ క్యాలెండర్) జుమ్మా ప్రార్థనల సమయంలో జన్మించిన మా చిన్నారి నూరే అలీ అక్తర్‌కు స్వాగతం. 2024 మార్చి 1న జన్మించిన నా కూతురిని మీరందరూ ఆశీర్వదించండి.' అంటూ షోయబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు, సోషల్ మీడియా వేదికగా అక్తర్ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ చిన్నారిని ఆశిర్వదిస్తున్నారు.
లెఫ్టార్మ్ పేసర్ షోయబ్ అక్తర్ 90'ల్లో తన పదునైన బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించేవాడు. ఇక తన కెరీర్లో టెస్టుల్లో 178, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో అతి తక్కువ టీ20 మ్యాచ్ (15)లు ఆడిన అక్తర్ 19 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఆడిన అతి తక్కువ మంది పాకిస్థాన్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు షోయబ్ అక్తర్. పాకిస్థాన్ ప్లేయర్లలో మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ హఫీజ్, సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్, సోయల్ తన్వీర్ ఐపీఎల్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 2008లో షోయబ్ అక్తర్ దిల్లీ క్యాపిటల్స్ (అప్పటి దిల్లీ డేర్ డేవిల్స్)కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 3 మ్యాచ్‌లు ఆడిన అక్తర్ 5 వికెట్లు పడగొట్టాడు.