Arhar Dal Recipe Without Onion and Garlic : ఎక్కువ మంది ఇష్టపడే రెసిపీలలో ఒకటి పప్పు. చాలా మంది పప్పు కర్రీని వివిధ పదార్థాలతో కలిపి రకరకాల వెరైటీలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, దాదాపు అందరూ ఏ కూరయినా సరైన టేస్ట్ రావడానికి అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి అనేవి తప్పనిసరిగా వేస్తుంటారు! ముఖ్యంగా పప్పు, సాంబార్ వంటివి చేసేటప్పుడయితే అవి కంపల్సరీగా ఉండాల్సిందే. కానీ, మీకు తెలుసా? ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కూడా అద్దిరిపోయే రెసిపీలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి.. నార్త్ ఇండియన్ స్టైల్ "అర్హర్ దాల్" రెసిపీ. దీని టేస్ట్ చాలా బాగుంటుంది! పైగా చాలా తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు(అర్హర్ దాల్) - 1 కప్పు
- టమాటా - 1(పెద్ద సైజ్ది)
- పచ్చిమిర్చి - 2
- పసుపు - అరటీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆలోపు రెసిపీలోకి కావాల్సిన టమాటా, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న పప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకోవాలి. ఆపై రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ మొత్తం బయటకు వెళ్లిపోయాక మూత తీసి పప్పు గుత్తి లేదా గరిటె సహాయంతో మెత్తగా మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. అది వేగాక ఇంగువ వేసి కలిపి కొన్ని సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా ఉడికించి మాష్ చేసుకున్న కందిపప్పు మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి సన్నని మంట మీద 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఇక ఆఖర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే నార్త్ ఇండియన్ స్టైల్ "అర్హర్ దాల్ రెసిపీ" రెడీ!
- దీన్ని అన్నం, చపాతీ, రోటీలు ఇలా దేనిలో వేసుకొని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. మరి, నచ్చిందా అయితే మీరు ఓసారి ఇలా సింపుల్గా ఈ దాల్ కర్రీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి!
ఇవీ చదవండి :
ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!
రుచిలో ఆహా, ఆరోగ్యపరంగా ఓహో అనిపించే - కమ్మని "క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ"!