Telangana Police Thinking to Give Weapons to Police : రాష్ట్రంలో తుపాకుల సంస్కృతి పెరిగిపోతుండటంతో పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలనే అంశంపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి తొమ్మిదేళ్ల క్రితం సూర్యాపేట బస్టాండులో సిమీ ఉగ్రవాదులు నిరాయుధులైన ఇద్దరు పోలీసులను కాల్చి చంపారు. అప్పుడే ఆయుధాలు ఇవ్వాలని భావించారు. అప్పట్లో ఆ ప్రతిపాదన వాయిదా పడగా, తాజాగా అఫ్జల్‌గంజ్ ఉదంతంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి.
మావోయిస్టులు దాడి చేసినా స్టేషన్లో సిబ్బంది ఆయుధాలతో తిప్పిగొట్టేలా వాటిని ఏర్పాటు చేశారు. ఎస్సై, ఆపై స్థాయి అధికారులు విధిగా ఆయుధాలు ధరించేవారు. స్టేషన్లలోనూ ఆయుధాలు ఉంచేవారు. వామపక్ష తీవ్రవాదం సద్దుమణిగిన తర్వాత ఈ విధానానికి స్వస్తి పలికారు. కేవలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ పైస్థాయి అధికారులకు మాత్రమే పిస్తోలు వంటి చిన్న ఆయుధాలను ఇస్తున్నారు. సాయుధ సెంట్రీ పోస్టు కూడా తీసేశారు. ‘వాచ్’ పేరుతో ఆయుధం లేని కానిస్టేబుల్ కాపలా విధులు నిర్వర్తిస్తున్నారు. మావోయిస్టు ప్రభావం లేని ప్రాంతాలు, పట్టణాలు, నగరాలలోని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది అందరికీ ఆయుధాలు తీసేశారు.
- 2009, 2010 సంవత్సరాల్లో ఉగ్రవాది వికారుద్దీన్ జరిపిన కాల్పుల్లో నిరాయుధులైన ఇద్దరు పోలీసులు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
- 2014లో నకిలీ నోట్ల కేసులో పట్టుకోవడానికి వచ్చిన సైబరాబాద్ పోలీసులపై శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి మజీద్‌పూర్ వద్ద రౌడీషీటర్ ఎల్లం గౌడ్ జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతిచెందారు.
- 2015 ఏప్రిల్ 2న సూర్యాపేట బస్టాండులో అస్లాం, ఎజాజుద్దీన్ అనే ఇద్దరు సిమీ ఉగ్రవాదులు తమను తనిఖీ చేయడానికి వచ్చిన కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు కుమ్మరి మహేశ్‌లను కాల్చి చంపేశారు. అనంతరం పారిపోయిన వారిని వెతుక్కుంటూ వెళ్లిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజులను కూడా కాల్చి చంపారు. దాంతో ప్రాంతంలో సంబంధం లేకుండా ఎస్సై ఆపై స్థాయి పోలీసులు అందరికీ ఆయుధాలు ఇవ్వాలని అప్పట్లోనే అధికారులు భావించారు. విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు స్పందించేలా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక ప్రత్యేక సాయుధ బృందాన్ని అందుబాటులో ఉంచాలని కూడా ఆలోచించారు. కాలక్రమంలో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. తాజాగా కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులు డబ్బు సంచులతో హైదరాబాద్ వచ్చి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ వెళ్లేందుకు బస్సు ఎక్కేటప్పుడు మరోమారు కాల్పులు జరిపారు. వారి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. పైగా ఈ మధ్యకాలంలో ఉత్తరాది నుంచి విచ్చలవిడిగా రాష్ట్రంలోకి ఆయుధాలు రవాణా అవుతున్నాయి. ఇలా అక్రమంగా వచ్చాయంటే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులతో పోలీసులకు ఆయుధాలు అందుబాటులో ఉంచాలనే డిమాండు తెరపైకి వస్తోంది.
షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్లకు గోల్డెన్ ఛాన్స్ - పోలీస్ డిపార్ట్ మెంట్ సూపర్ ఆఫర్ - లాస్ట్ డేట్ ఇదే