Bangladesh Captain On Shakib Al Hasan :బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ప్రశంసలు కురిపించాడు. షకీబ్ వ్యక్తిగత జీవితంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఆట నుంచి తన దృష్టిని కోల్పోలేదని తెలిపాడు. షకీబ్ అల్ హసన్ అంకితభావం ఉన్న వ్యక్తిగా కొనియాడాడు. జట్టు విజయానికి ఏం అవసరమో అది చేస్తాడని చెప్పాడు.
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుల్లో పాక్‌పై ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. ఈ మ్యాచ్‌లో షకీబ్ నాలుగు వికెట్లు పడగొట్టి బ్యాటింగ్‌లో 15 పరుగులు చేశాడు. "షకీబ్ అల్ హసన్ అంకితభావం ఉన్న వ్యక్తి. జట్టు విజయానికి ఏం అవసరమో అది చేస్తాడు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి క్రికెట్‌పై ఎలా దృష్టి పెట్టాలి? జట్టుకు, జూనియర్లకు ఏ విధంగా సహకారం అందించాలన్న సంగతి అతడికి తెలుసు. ఇబ్బందికర పరిస్థితిని (హత్యానేరం కేసు) ఎదుర్కొంటున్నా ఆటపరంగా రాణించాడు. బౌలింగ్‌లో పలు సూచనలు ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్టులో షకీబ్ మరింత మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నాం" అని బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు.
అయితే పాకిస్థాన్‌పై సాధించిన ఈ విజయం దేశ ప్రజలకు ఉత్సాహాన్ని ఇస్తుందని శాంటో ఆశాభావం వ్యక్తం చేశాడు. "నెలరోజుల నుంచి దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కానీ, మేమందరం ఒకరికొకరం మద్దతుగా నిలుస్తున్నాం. ఈ విజయం దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెస్తుందని ఆశిస్తున్నాం. అందుకే చాలా సంతోషంగా ఉన్నాం. రెండో టెస్టులోనూ ఇదే ఆటతీరును కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం" అని నజ్ముల్ హుస్సేన్ శాంటో తెలిపాడు.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల షకీబ్ అల్ హసన్ ఎంపీ పదవిని కోల్పోయాడు. రెండు రోజుల కిందట అతడిపై హత్యానేరం నమోదైంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో షకిబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వెంటనే బంగ్లాదేశ్‌కు రప్పించాలని బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది.