Sarfaraz Khan Team India:ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్లో అరంగేట్రం చేసిన దాదాపు 8 ఏళ్లకు టీమ్ఇండియా పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడం వల్ల సర్ఫరాజ్‌కు బీసీసీఐ పిలుపు అందింది. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ తన కుమారుడిపై నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు.
'ఈరోజు సర్ఫారాజ్ టీమ్ఇండియా ఎంపికయ్యాడు. అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్న సెలక్టర్లకు, బీసీసీఐకి నా కృతజ్ఞతలు. సర్ఫరాజ్‌ను ఎంతోగానో ప్రొత్సహించిన ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA)కు, అలాగే అతడు అనుభవం పొందిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అతడు అద్భుతంగా ఆడాలని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిద్దాం. థాంక్యూ' అని సర్ఫరాజ్ తండ్రి అన్నారు.
ఇక సర్ఫరాజ్ టీమ్ఇండియాకు ఎంపిక అవ్వడం పట్ల, టీ20 నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అతడికి శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సర్ఫరాజ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. 'మెయిడెన్ ఇండియా కాల్. ఉత్సవ్ కీ తయ్యారీ కరో' అని క్యాప్షన్ రాశాడు.