Rohit Sharma On Captaincy:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2019, 2023 వన్డే వరల్డ్‌కప్‌ల ఓటమిపై మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్‌తో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు, నాయకత్వ లక్షణాల గురించి చర్చించాడు. టీమ్ఇండియాకు కెప్టెన్ అవ్వడం గౌరప్రదమైందని అన్నాడు. అయితే మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక జట్టులో కొంత మార్పు తీసుకు రావాలనుకున్నట్లు తెలిపాడు. ప్లేయర్ల స్కోర్లు కేవలం నంబర్లేనని రోహిత్ అన్నాడు.
'ప్లేయర్లు గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. నేను ఇందులో చిన్న మార్పు తీసుకురావాలనుకున్నా. ప్రజలు గణాంకాలను చూడడం లేదు. ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్లపై పెద్దగా ఆసక్తిగా లేరు. మంచి గేమ్ ఆడడాన్నే వారు కోరుకుంటున్నారు. ఇండియాలో గణాంకాల గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో నేను ఐదు సెంచరీలు బాదాను. ఏంటి లాభం? ఆ టోర్నీలో ఓడిపోయాం కదా. నాకు ట్రోఫీకి కావాలి. ట్రోఫీ గెలవకుండా ఐదు, ఆరు సెంచరీలు చేసినా ఫలితం లేదు కదా!' అని అన్నాడు.
'టీమ్ఇండియాకు కెప్టెన్ అవుతున్నానని తెలిసినప్పుడు చాలా సంతోషించా. గత 7-8 ఏళ్లుగా జట్టులో కీలక ప్లేయర్‌గా, వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. విరాట్ కెప్టెన్సీ సమయంలో అతడు అందుబాటులో లేనప్పుడు నేనే జట్టును నడిపించా. మన దేశ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. టీమ్ఇండియాకు అనేక మంది గొప్ప వ్యక్తులు నాయకత్వం వహించారు' అని అన్నాడు.