Rohit Sharma Mumbai Indians:2025 ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ప్రయాణం ముంబయితో ఇక ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. ముంబయి ఇండియన్స్ జట్టు రోహిత్ ను అట్టిపెట్టుకోదని పేర్కొన్నాడు. ఆ జట్టుతో కొనసాగడం రోహిత్ కూ ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానల్ లో చోప్రా ఈ మేరకు అంచనా వేశాడు.
వేలంలో వేరే జట్టుకు రోహిత్!
'రోహిత్ ముంబయితో ఉండడని నేను భావిస్తున్నాను. మూడేళ్ల పాటు ఆడగలిగితేనే జట్టులో రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎంఎస్ ధోనీకి ఇది వర్తించదు. ధోనీ- చెన్నై సూపర్ కింగ్స్ కథ వేరేలా ఉంటుంది. కానీ ముంబయి ఇండియన్స్ పరిస్థితి వేరు. అయితే ముంబయి నుంచి రోహిత్ శర్మనే స్వయంగా వెళ్లిపోవచ్చు. లేదా ముంబయి జట్టే రోహిత్ ను అట్టిపెట్టుకోకపోవచ్చు. వేలంలో రోహిత్‌ను వేరే జట్టు తీసుకోవచ్చు. సూర్యకుమార్‌ను ముంబయి ఇండియన్స్ వదులుకోదు. అతడు ముంబయితోనే ఉంటాడు' అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
భువనేశ్వర్ ఔట్!
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మను రిటైన్ చేసుకుంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ నలుగురిని సన్ రైజర్స్ వదులుకోదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టిస్తారని, ఆ తర్వాత క్లాసెన్ వచ్చి వీరవిహారం చేస్తాడని, అందుకే వీరెవర్ని సన్ రైజర్స్ వదులుకోదని అన్నాడు. మార్ క్రమ్ గురించి కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నాడు. ఈ క్రమంలో భువనేశ్వర్‌ను ఈసారి సన్ రైజర్స్ విడిచిపెట్టవచ్చని అభిప్రాయపడ్డాడు.