Rohit Sharma Ignored MS Dhonis Advice : క్రికెట్ హిస్టరీలో వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు చేశాడు ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ తన మొట్ట మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చేశాడు. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని రోహిత్ గతంలో షేర్ చేసుకున్నాడు. 2020లో రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో రోహిత్ మాట్లాడుతూ, మ్యాచ్ సమయంలో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన సూచనలను తాను పట్టించుకోలేదని చెప్పాడు.
- ధోనీ ఏం సలహా ఇచ్చాడు?
2013 నవంబర్‌లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్ మొదటి డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు. ధావన్ 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ (0), సురేష్ రైనా (28), యువరాజ్ సింగ్ (12) త్వరగా పెవిలియన్ చేరారు.
34వ ఓవర్‌లో భారత్ 207/4తో ఉంది. ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. సేఫ్‌గా ఆడాలని, ఇన్నింగ్స్ చివరి వరకు ఆడటంపై దృష్టి పెట్టాలని రోహిత్‌కు సూచించాడు. తాను రిస్కులు తీసుకొంటానని ధోనీ చెప్పాడు. అయితే రోహిత్ ఈ సలహాను పట్టించుకోలేదట. ఆస్ట్రేలియా బౌలర్లపై దాడి చేయడం ఏ దశలోనూ ఆపలేదు.
అశ్విన్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో రోహిత్ మాట్లాడుతూ, "పార్ట్‌నర్‌షిప్ సమయంలో, అతడు (ధోనీ) నాతో మాట్లాడుతున్నాడు, చర్చిస్తూనే ఉన్నాడు. నువ్వు సెట్ బ్యాట్స్‌మెన్, 50వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలి. నేను రిస్కు తీసుకొంటాను అని చెప్పాడు." అని గుర్తు చేసుకొన్నాడు.
- రోహిత్ సంచలన ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో రోహిత్ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 12 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ధోనీ 38 బంతుల్లో 62 పరుగులు చేయడంతో భారత్ 383 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకే పరిమితం కావడంతో, భారత్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. - రోహిత్ ఇతర డబుల్ సెంచరీలు
రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. అవన్నీ భారత్‌లోనే చేశాడు. రెండో డబుల్ సెంచరీ 2014 నవంబర్‌లో కోల్‌కతాలో శ్రీలంకపై చేశాడు. ఈ మ్యాచ్‌లో 173 బంతుల్లో 264 పరుగులతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సృష్టించాడు. మూడో డబుల్ సెంచరీ 2017 డిసెంబర్‌లో మరోసారి శ్రీలంకపై చేశాడు. మొహాలీలో 153 బంతుల్లో 208* పరుగులు చేశాడు. - కెరీర్‌లో అతిపెద్ద నిరాశ అదే!
2011 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడాన్ని తన కెరీర్‌లో అతి పెద్ద నిరాశగా రోహిత్ పేర్కొన్నాడు. భారత్‌లో వరల్డ్ కప్ నిర్వహించారు, పైగా రోహిత్ సొంత మైదానం ముంబయిలో ఫైనల్ జరిగింది. ఇవన్నీ రోహిత్ బాధను మరింత పెంచే అంశాలు. అనంతరం రోహిత్ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీల(7) రికార్డు సొంతం చేసుకున్నాడు. 2019 వరల్డ్ కప్‌లోనే ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు.