Rohit Sharma First Double Century :టీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ వన్డే చరిత్రలో మూడు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ మరే ఇతర క్రికెటర్ ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా చేరలేదు. అయితే, 2013లో సరిగ్గా ఇదే రోజున (నవంబర్ 2న) ఈ ఘనతను రోహిత్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు ద్విశతకాలు సాధించిన ప్లేయర్లుగా కొనసాగుతున్న సమయంలో సరిగ్గా 11 ఏళ్ల కిందట రోహిత్ తన వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని బాదాడు. ఈ ఘనతతో అప్పుట్లోనే ఆ లెజెండ్స్ సరసన చేరిన రోహిత్, ఇప్పుడు ప్రపంచ వన్డే క్రికెట్‌లోనే అత్యధిక డబుల్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ కలిగిన ఆస్ట్రేలియాపై ద్విశతకం (209: 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్స్‌లు) చేయడం అనేది క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని ఓ రేర్ ఫీట్.
ఇంతకీ ఆ మ్యాచ్ ఎలా సాగిందంటే?
భారత్ పర్యటనలో భాగంగా 2013లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు వచ్చింది. ఇక్కడ ఇరు జట్లు ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ కోసం తలపడ్డాయి. అయితే అందులో ఏకైక టీ20తో పాటు వన్డే సిరీస్‌ను మాత్రమే టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. తొలి, మూడో వన్డేలతో ఆసీస్ ఆధిపత్యం చలాయించగా, రెండో, ఆరో వన్డే మ్యాచ్‌ల్లో మాత్రం భారత్ విజయ పరంపర కొనసాగించింది. ఓ రెండు మ్యాచ్‌లు మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దైపోయాయి. దీంతో చివరి (ఏడో వన్డే) మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు కీలకంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 383 పరుగులను స్కోర్ చేసింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఆసీస్ జట్టు 326 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ (209) శిఖర్ ధావన్ (60)తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే ధావన్‌తో పాటు విరాట్ కోహ్లీ (0) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (28), యువరాజ్ (12)తో కలిసి రోహిత్ స్వల్ప భాగస్వామ్యాలు నిర్మించాడు. 207 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడ్డ భారత ఇన్నింగ్స్‌ను ఎంఎస్ ధోనీ (62)తో కలిసి రోహిత్ ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ ఐదో వికెట్ సమయానికి 167 పరుగులు జోడించారు.