తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్‌గా రో'హిట్‌'- హిట్​మ్యాన్ సారథ్యంలో భారత్ టాప్​లోకి - Rohit Sharma Captaincy Record

Rohit Sharma Captaincy Record: జట్టులో కీలక ఆటగాళ్ల లేకపోయినా బెదరలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లతోనే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్​లో విజయం దిశగా నడింపిచాడు రోహిత్ శర్మ. కుర్రాళ్లతో కలిసి ఉంటూ వాళ్ల ప్రోత్సహిస్తూ, మరో పక్క వారికి స్ఫూర్తిగా నిలుస్తూ జట్టును ముందుకు నడింపించాడు.

Rohit Sharma Captaincy Record
Rohit Sharma Captaincy Record

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 9:15 AM IST

Rohit Sharma Captaincy Record: కీలక ఆటగాళ్లు లేరు, అయినా బెదరలేదు. తొలి టెస్టులోనే ఓటమి ఎదురైంది. అయినా ఢీలా పడలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మద్దతుగా నిలిచి అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని ఇంగ్లాండ్‌ సిరీస్‌లో జట్టును విజయతీరాల వైపు నడిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. నాయకుడు అంటే సవాళ్లకు ముందు నిలిచేవాడు. సారథి అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును గెలుపు వైపు మళ్లించేవాడు. తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన టెస్టు సిరీస్‌లో రోహిత్‌ శర్మ అదే చేశాడు. నాయకత్వంతో మెప్పించి జట్టు 4-1తో సిరీస్‌ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

కఠిన సవాలే
ఇంగ్లాండ్‌తో తాజాగా జరిగిన​ సిరీస్ చూస్తే, తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకున్న తీరు కనిపిస్తుంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా తామున్నామంటూ దూసుకొచ్చిన యువ క్రికెటర్ల సత్తా తెలుస్తుంది. ప్రత్యర్థి బజ్‌బాల్‌ వ్యూహాన్ని చిత్తు చేసిన జట్టు తెగువ అర్థమవుతుంది. అయితే వీటన్నింటి వెనుక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ టెస్టులో ఓటమి తర్వాత అతను జట్టును నడిపించిన తీరు, కుర్రాళ్లను ప్రోత్సహించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ కెప్టెన్సీగా రోహిత్‌ కెరీర్‌లోనే ఈ సిరీస్‌ కఠిన సవాలు విసిరింది. బజ్‌బాల్‌ అంటూ దూకుడుతో వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టును స్వదేశంలో నిలువరించకపోతే తీవ్రమైన విమర్శలు తప్పేవి కావు. పైగా జట్టులో కుర్రాళ్లు. అంతర్జాతీయ అనుభవం లేని వాళ్లతో కలిసి ఆడటం అంత సులువు కాదు. కానీ, రోహిత్‌ ఆ అడ్డంకులను అధిగమించాడు.

కొత్త కుర్రాళ్లతోనే గెలుపు
దాదాపు దశాబ్ద కాలంగా జట్టులో మూడు, అయిదు స్థానాల్లో ఆడిన పుజారా, రహానె ఇప్పుడు లేరు. వీళ్ల స్థానాలను భర్తీ చేసే బాధ్యతను శుభ్‌మన్‌, శ్రేయస్‌ తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లి, షమి పూర్తిగా దూరమయ్యారు. గాయం తదితర కారణాల వల్ల తొలి టెస్టు తర్వాత కేఎల్‌ రాహుల్‌, రెండో టెస్టు తర్వాత శ్రేయస్‌ అందుబాటులో లేకుండా పోయారు. రెండో టెస్టులో జడేజా ఆడలేదు. నాలుగో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. దీంతో రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఇలా ఈ సిరీస్‌లో అయిదుగురు టెస్టుల్లో అడుగుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టును నడిపించడమంటే సులువైన విషయం కాదు. కానీ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని రోహిత్‌ సాగిపోయాడు. కుర్రాళ్లకు అవకాశాలిస్తూ సరైన జట్టు కూర్పును ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎవరున్నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రయత్నించాడు. అనుభవం లేని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నమ్మకం పెట్టాడు. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో అశ్విన్‌ మధ్యలో వెళ్లివచ్చినా ఉన్న బౌలర్లతోనే ఇంగ్లాండ్‌ వికెట్లు పడేలా చూశాడు.

బ్యాటింగ్​పై ప్రభావం పడకుండా
ఈ సిరీస్​లో రోహిత్ కెప్టెన్​గాను మెప్పించాడు. సీనియర్​ బ్యాటర్​గా పరుగులు సాధిస్తూ కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. రెండు శతకాలు, ఓ అర్ధశతకంతో 9 ఇన్నింగ్స్​ల్లో 400 పరుగులు చేశాడు. రాజ్‌కోట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ధర్మశాలలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేశాడు. రాంచి టెస్టులో ఛేదనలో కీలకమైన 55 పరుగులతో రాణించాడు. మూడు ఫార్మాట్లలోనూ వెయ్యి పరుగులు చేసిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్‌ఇండియా ఫైనల్‌ దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించే బాధ్యత రోహిత్‌దే. ఈ నేపథ్యంలో సారథిగా అతను దేశానికి ఒక ఐసీసీ ట్రోఫీ అందిస్తే చూడాలన్నది అభిమానుల ఆశపడుతున్నారు.

కెప్టెన్​గా సంతోషం
2022 మార్చిలో అన్ని ఫార్మాట్లలోనూ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన రోహిత్‌ సారథ్యంలో భారత్‌ ఇప్పటివరకూ 16 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. రెండు డ్రా చేసుకుంది. నాలుగింట్లో ఓడింది. తను కెప్టెన్ అయినప్పటి నుంచి ఎప్పుడూ పూర్తిస్థాయి జట్టుతో ఆడలేదని రోహిత్​ శర్మ తెలిపారు. ' అలా ఆడలేదని చెప్పి తప్పించుకోను. అందుబాటులో ఉన్న జట్టుతో కలిసి పనిచేయాలి. మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. వాళ్లను స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నా. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా నేనెక్కడ వెనుకబడ్డానో, విభిన్నంగా ఏమేం చేయాలో మరింతగా అర్థమైంది' అంటూ రోహిత్ శర్మ అన్నాడు.

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియానే నెం.1- ర్యాంకింగ్స్​లో భారత్ డామినేషన్​

ABOUT THE AUTHOR

...view details