Roger Federer Doctorate Speech : రోజర్ ఫెదరర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు . తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను దక్కించుకుని తిరుగులేని ఆటగాడిగా ఎదిగాడు. అయితే తాజాగా అతడు న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో నేర్చుకున్న విలువైన మూడు పాఠాలను తెలిపాడు. తన కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు, అందుకున్న ప్రతీ విజయానికి ఎంతో కష్టపడినట్లు పేర్కొన్నాడు.
"మొదటిది ఎఫర్ట్‌లెస్. ఈ పదం వింటేనే చిరాకొస్తుంది. ఎందుకంటే శ్రమించకుండా ఏదీ అంత ఈజీగా దొరకదు. చాలా మంది నేనేదో అలవోకగా ఆడేస్తానని అంటుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఎన్నో సార్లు నాకు నేనే తిట్టుకునేవాడిని. రాకెట్ విసిరి కొట్టేవాడిని. నేనే కాదు ప్రతి ఒక్కరు తాము అనుకున్నది సాధించేందుకు కచ్చితంగా కష్టడాల్సి ఉంటుంది.
ఇక రెండో పాఠం ఏంటంటే వీలైనంతవరకు అనుకున్నదానికన్నా ఎక్కువ కష్టపడండి. అయినా కూడా ఓటిమిని అందుకుంటే ఆఖరివరకు పోరాడుతూనే ఉండాలి. నా కెరీర్‌లో వింబుల్డన్‌లో ఓడిపోయాను. నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాను. అయినా కూడా ఆ సమయంలో చాలా మంది ప్రశంసలతో ముంచెత్తారు. కానీ అప్పుడు వాటిని నేను పట్టించుకోలేదు. ఏమి చేయాలో నాకు తెలుసు. నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మీరు కూడా ప్రశంసలను ఎప్పుడూ పట్టించుకోకండి.