Rishabh Pant IPL Remuneration : తాజాగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యధిక ధర అందరినీ ఆశ్చర్యపరిచాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంత్‌ను ఏకంగా ను రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ వార్త తెలిసిన దగ్గరి నుంచి చాలా మందికి ఓ సందేహం వచ్చే ఉంటుంది. పంత్‌కు ఆ రూ.27 కోట్ల రెమ్యూనరేషన్ ఆన్ హ్యాండ్ వస్తుందా? లేకుంటే ట్యాక్స్‌లు మినహాయించి అంతకంటే తక్కువ వస్తుందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే క్రీడా వర్గాల సమాచారం ప్రకారం వాస్తవానికి పంత్ చేతికి రూ.27 కోట్లు రాదట. అందులో రూ.8.1 కోట్లు పన్నులకు పోగా మిగతా రూ. 18.9 కోట్లు మాత్రమే తనకు అందుతాయని తెలుస్తోంది.
ఇలా అయితేనే ఫ్రాంచైజీ నుంచి డబ్బు!
అయితే పంత్ టోర్నీకి ముందు గాయపడితే ఆ డబ్బు రాదట. అలాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నా కూడా డబ్బు ఇవ్వరని తెలుస్తోంది. టోర్నీ మధ్యలో గాయపడి మిగితా మ్యాచ్‌లకు దూరమైతే మాత్రం డబ్బు చెల్లిస్తారట. ఇక భారత్ మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడితే డబ్బు చెల్లిస్తారని సమాచారం.
ఆటగాళ్లకు ఇచ్చే ఐపీఎల్ జీతాలపై పన్ను ఎలా విధిస్తారు?
ఐపీఎల్లో వచ్చే ఆదాయంపై ఇండియన్, విదేశీ ప్లేయర్లకు భారత ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఇది క్రికెటర్లు ఉండే నివాస ప్రదేశం, దేశంలో వారు ఆర్జించే ఆదాయం ఆధారంగా మారుతూ ఉంటుంది. భారత్‌కు చెందిన ప్లేయర్స్‌ను ఇండియా పౌరులుగా గుర్తిస్తారు. వీరికి వచ్చిన ఆదాయంలో 30 శాతం ట్యాక్స్ పడుతుంది. విదేశీ ప్లేయర్లను నాన్ రెసిడెంట్లుగా పరిగణిస్తారు. కాబట్టి వీరికీ అంతే మొత్తంలో పన్ను ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఐపీఎల్లో వచ్చిన మొత్తాన్ని పొందేందుకు ప్లేయర్లు బీసీసీఐ, ఫ్రాంచైజీతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రాంచైజీ చెల్లింపు చేయడంలో విఫలమైతే, బీసీసీఐ చర్యలు తీసుకుంటుంది.
ట్యాక్స్ పోగా వీరికి ఎంత డబ్బు వస్తుందంటే?
స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అందులో రూ.7.95 కోట్లు ట్సాక్స్ పోనూ, శ్రేయస్ చేతికి రూ. 18.8 కోట్లు రానుంది.
అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అందులో రూ.5.4 కోట్లు ట్యాక్స్‌కు పోగా, రూ.12.6 కోట్లు అర్ష్‌దీప్ సింగ్ చేతికి రానుంది.