Pant On Bumrah Konstas Fight :సిడ్నీ టెస్టు తొలి రోజు టీమ్ఇండియా కెప్టెన్- ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. మైదానంలోనే ఈ ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. మధ్యలో ఫీల్డ్ అంపైర్ కలుగజేసుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ గొడవపై టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్లు సమయం వృథా చేయాలన్న ఉద్దేశంతోనే కొన్‌స్టాన్ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. 'ఆసీస్ ఓపెనర్లు అతి తెలివి ప్రదర్శించారు. సమయం వృథా చేయాలని అనుకున్నారు. అందుకే బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవకు దిగాడని భావిస్తున్నాను. అతడు ఏం అన్నాడో నాకు వినిపించలేదు. కానీ, మేం మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని వాళ్లు భావించినట్లు నాకు అనిపించింది' అని పంత్ అన్నాడు.
ఇదీ జరిగింది
సిడ్నీ టెస్టు తొలి రోజు ముగుస్తుందనగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ వేయబోతుండగా, స్టైకింగ్లో ఉన్న ఖవాజా ఆగాలంటూ సైగ చేశాడు. అప్పుడు కొన్‌స్టాస్ కలుగజేసుకుని ఆగమని బుమ్రాకి సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. బుమ్రాకి కొన్‌స్టాస్ తీరు నచ్చలేదు, 'నీ సమస్య ఏంటి' అని ప్రశ్నించాడు. ఇంతలో అంపైర్ కలగజేసుకొని ఇద్దరినీ దూరంగా పంపించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.