Rinku Singh Exclusive ETV Bharat: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ ఐపీఎల్ రిటెన్షన్స్‌లో భారీ ధర దక్కించుకున్నాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రూ.13 కోట్లు ఇచ్చి మరీ అట్టిపెట్టుకుంది. దీంతో రింకూ ఇంట దీపావళి సంబరాలు రెట్టింపు అయ్యాయి. గతేడాది ఐపీఎల్ శాలరీ రూ.55 లక్షలు ఉండగా, ఈసారి అమాంతం పెరిగి రూ.13 కోట్లకు చేరుకోవడం పట్ల రింకూ తండ్రి ఖాన్చంద్ర సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆయనకు ఖరీదైన ఇల్లు, కారు బహుమతిగా ఇచ్చాడని ఖాన్చంద్ర సింగ్ ఈటీవీ భారత్‌తో చెప్పారు.
ఇల్లు, కారు గిఫ్ట్ ఇచ్చాడు
'రింకూ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పటికీ ఎంతో కష్టపడతాడు. అతడు అలీగఢ్ (రింకూ సొంత ఊరు) వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వారిని కలుస్తాడు. రింకూలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ సింపుల్‌గానే ఉంటాడు. రీసెంట్గా నాకు కొత్త ఇల్లు, కారు బహుమతిగా ఇచ్చాడు. త్వరలోనే మేం కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతాం' అని రింకూ తండ్రి అన్నారు.
'ఉద్యోగం మానేయాలన్నాడు'
రింకూ తండ్రి ఖాన్చంద్ర సింగ్ ఎల్పీజీ సిలిండర్ డెలివరీ ఏజెన్సీలో పనిచేస్తారు. ఆయన ఇప్పటికీ ఇళ్లకు, హోటళ్లకు సిలిండర్ సప్లై చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సిలిండర్ డెలివరీ ఉద్యోగం మానేయాలని రింకూ తన తండ్రిని ఇప్పటికే పలుమార్లు కోరాడట. కానీ, దీనికి తాను అంగీకరించలేదని ఖాన్చంద్ర తెలిపారు.