Rachin Ravindra Double Century: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు అద్భుతమైన డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్ సెంచరీ మార్క్‌ను టచ్ చేశాడు. అయితే రవీంద్ర టెస్టు కెరీర్లో సాధించిన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చడం విశేషం. మొత్తంగా 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్స్‌లతో 240 పరుగులు చేశాడు. కాగా, గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో జరుగుతున్న ఇదే మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేన్ మామ (118 పరుగులు)చేశాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 511 భారీ స్కోర్ నమోదు చేసింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసేసరికి 80-4తో నిలిచింది. డేవిడ్ బెడింఘమ్ (29), కీగన్ పీటర్సన్ (2) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు ఎడ్వర్డ్ మూరే (23), నీల్ బ్రాండ్ (4), వాన్ టండర్ (0), జుబైర్ హంజా (22) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమిసన్ 2, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ తలో వికెట్ దక్కించుకున్నారు.