Preity Zinta On Rohit Sharma:ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఎంత్తైనా ఖర్చు చేస్తానని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింతా ఖండించింది. అవన్నీ ఫేక్ వార్తలన్న (Fake)ప్రీతీ, తాను రోహిత్‌పై అలాంటి కామెంట్స్ చేయలేదని పేర్కొంది. అవన్నీ ఉత్తి పుకార్లేనని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.
'అవన్నీ ఫేక్ వార్తలు. రోహిత్ శర్మపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను అతడి ఫ్యాన్ కూడా. కానీ, నేను తన గురించి ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌పై కూడా నాకు అపార గౌరవం ఉంది. ప్రస్తుతం ధావన్ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దు. ఇప్పుడు మా జట్టు చాలా బలంగా ఉంది. ప్రస్తుతం మా దృష్టి అంతా 2024 ఐపీఎల్ టైటిల్ సాధించడంపైనే ఉంది' అని ప్రీతీ జింతా తన ఎక్స్ (ట్విట్టర్)లో అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది.
అసంలేం జరిగిందంటే?
పంజాబ్ కింగ్స్ రీసెంట్గా రాజస్థాన్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రీతీ తమ జట్టుకు నిలకడగా రాణిస్తూ, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న ప్లేయర్ కావాలని ఆమె అభిప్రాయపడిందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె 2025 మెగావేలంలోకి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే ఎంత భారీ మొత్తానికైనా కొనుగోలు చేసేందుకు సిద్ధం అన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీతీ తాజాగా క్లారిటీ ఇచ్చింది.