T20 World Cup 2024 Celebrities Wishes : ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగులతో తేడాతో భారత్ జట్టు విజయం సాధించడం వల్ల అభినందనలు వెల్లువెత్తాయి. అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమ్ఇండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ నాయకుల నుంచి క్రీడా, సీనీ ప్రముఖల వరకూ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.
'కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నారు'
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అకుంఠిత స్ఫూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు. యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని టీమ్ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిడ్జ్‌టౌన్ భారత్ విజయం సాధించిన వెంటనే ట్విట్టర్‌లో ప్రధాని మోదీ ఒక వీడియోను పోస్ట్ చేసి అభినందనలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. 'ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయంకాదు. భవ్య విజయం సాధించిన భారత జట్టుకు దేశ ప్రజలందరి తరపున అభినందనలు. ఈ రోజు 140 కోట్ల మంది దేశ ప్రజలు మీ(భారత జట్టు) అసాధారణ ప్రదర్శన చూసి గర్వపడుతున్నారు. క్రీడా మైదానంలో మీరు ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. అలాగే భారత్‌లోని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో కోట్ల మంది హృదయాలనూ గెలుచుకున్నారు' అని ప్రధాని మోదీ అన్నారు.
'టీమ్ఇండియా దేశాన్ని గర్వపడేలా చేసింది'
భారత జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టోర్నీ మొత్తం జట్టు విలక్షణమైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసించారు. అద్భుతమైన క్యాచ్ పట్టావని సూర్యకుమార్‌ను, నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు. మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అంకితభావంతో ఆడి గెలిచారని కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బృంద స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి అద్భుతమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోట్ల మందిని ప్రేరేపించి, నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోదిరాదిత్యసింధియా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు.