Paris Paralympics Silver Medalist Manish Narwal :మనీశ్ నర్వాల్ ఈ పేరు ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో గట్టిగానే వినపడుతోంది. ఎందుకంటే టోక్యో పారాలింపిక్స్‌లో పసిడితో సత్తా చాటిన అతడు ఇప్పుడు పారిస్‌లోనూ రజతంతో అదరగొట్టాడు. అయితే ఈ 22 ఏళ్ల కుర్రాడి కెరీర్ జర్నీ ఎంతో మందికి ఆదర్శం.
అన్నయ్య దూరంతో ఆరు నెలలు బాధలోనే -చిన్నప్పుడు నుంచి చేయి పట్టుకుని నడిపించిన అన్నయ్య ఒక్క సారిగా మనల్ని వదిలి దూరమైతే, ఎప్పుడు తోడుగా ఉంటూ ప్రోత్సహించిన ఆ అన్నయ్య ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే, తమ్ముడికి మనసులో కలిగే కష్టం, బాధ ఊహించడం కష్టం.
టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మనీశ్ నర్వాల్ జీవితంలో ఇదే జరిగింది. అతడు ఈ పసిడి సాధించిన తర్వాతి ఏడాదే ఈ విషాద ఘటన అతడి జీవితంలో చోటు చేసుకుంది. అప్పటి వరకు తన తోడుగా ఉంటూ, ప్రోత్సాహిస్తూ ఉన్న అన్నయ్య మంజీత్ సింగ్ 2022లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో మనీశ్ ఎంతగానో కుంగిపోయాడు.
ఆరు నెలల పాటు ఆ బాధలో నుంచి రాలేక తుపాకీ కూడా పట్టుకోలేదు. ఆ తర్వాత పారిస్ పారాలింపిక్స్‌లో మరో మెడల్ గెలిచి తన అన్నయ్యకు ఘన నివాళి సమర్పించాలనుకున్నాడు. ఆ లక్ష్యంతో మళ్లీ ప్రాక్టీస్‌పై బలంగా దృష్టి పెట్టాడు. ఇప్పుడు పారిస్‌లో సిల్వర్ మెడల్ సాధించి అనుకున్నది సాధించాడు.
ఆ ఇద్దరు దిగ్గజాలంటే అభిమానం - మనీశ్‌ది హరియాణా. అతడు పుట్టిన వెంటనే చికిత్సలో ఏదో లోపం జరిగింది. దీంతో అతడి కుడి భుజం నరాలు దెబ్బతిని చేయి పని చేయలేదు. మనీశ్‌కు చికిత్స అందించడం కోసం అతడి తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో క్రమక్రమంగా మనీశ్ తన వైకల్యాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. ఇక చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాడు. అతడికి దిగ్గజ స్ప్రింటర్ బోల్ట్, ఫుట్‌బాల్ స్టార్ మెస్సిలు అంటే ఎంతో అభిమానం. అందుకే అతడు మొదట ఫుట్‌బాల్‌ను ఇష్టపడి అందులో రాణించాలనుకున్నాడు.