Cabbage Boondi Fry Recipe : ఎక్కువమంది ఇష్టపడని కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. ఇక పిల్లలైతే క్యాబేజీని చూస్తే చాలు ముఖం తిప్పుకుంటారు. దానితో ఎంతటి రుచికరమైన కూరలు, ఫ్రైలు చేసిన కూడా తినడానికి ఇష్టపడరు. మీ పిల్లలు కూడా క్యాబేజీతో చేసిన వంటకాలు తినట్లేదా? అయితే, ఓసారి ఇలా "క్యాబేజీ బూందీ ఫ్రై" చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉండే దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు! ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- సన్నని క్యాబేజీ తరుగు - 3 కప్పులు
- ఆయిల్ - 6 నుంచి 7 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- జీడిపప్పు పలుకులు - 3 టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి తరుగు - 1 టీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- సన్నని ఉల్లిపాయ తరుగు - అరకప్పు
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టేబుల్‌స్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం బూందీ - 1 కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
వెడ్డింగ్ స్టైల్ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్ క్రిస్పీ అండ్ టేస్ట్ గ్యారెంటీ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టీమర్లో సన్నని క్యాబేజీ తరుగు వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. అంటే.. క్యాబేజీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఒకవేళ మీకు స్టీమర్ లేకపోతే స్టౌపై వాటర్‌లో క్యాబేజీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటర్ వడకట్టి స్టెయినర్లో వేసి పక్కన ఉంచుకోవాలి. అయితే, స్టీమర్లో ఉడికించుకుంటే క్యాబేజీలోని పోషకాలు బయటకు పోవు. రెసిపీ కూడా ఎక్కువగా రుచికరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. ఆపై అందులో జీడిపప్పు పలుకులు, అల్లం తరుగు, జీలకర్ర వేసి జీడిపప్పు రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- అవి వేగాక పచ్చిమిర్చి చీలికలు, సన్నని ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి ఆనియన్స్ మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ తరుగు, కారం, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడు మూత తీసి చూస్తే క్యాబేజీ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నింటినీ పీల్చుకుని చక్కగా మగ్గి ఉంటుంది.
- ఆవిధంగా క్యాబేజీ మగ్గిందనుకున్నాక ఆ మిశ్రమంలో కారం బూందీ, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకుని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "క్యాబేజీ బూందీ ఫ్రై" రెడీ!
- దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కలిగే ఫీలింగ్ సూపర్‌గా ఉంటుంది! మరి, ఆలస్యమెందుకు నచ్చితే మీరు ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి.
మీ పిల్లలు క్యాబేజీ అంటే మొహం చిట్లిస్తున్నారా? - ఈ విధంగా వడలు చేసి పెట్టండి మళ్లీ మళ్లీ అడుగుతారు!