Passport Service Centers in Hyderabad : హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రా (పీఎస్‌కే)ల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారులు ఎక్కువగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి కేంద్రాలనే ఎంచుకుంటున్నారని, దాంతో వాటిపై తీవ్రమైన భారం పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా దరఖాస్తుదారులు పాస్‌పోర్టు స్లాట్ బుక్ చేసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖ వెసులుబాటు కల్పించిందని తెలిపారు.
జిల్లా సేవా కేంద్రాలపై కొరవడిన అవగాహన : దీనిపై అవగాహన లేక చాలా మంది జిల్లావాసులు హైదరాబాద్‌లోని కేంద్రాలనే ఎంచుకుంటుండటంతో జాప్యమవుతోంది. దరఖాస్తుదారులు తమకు అతి సమీపంలో ఉండే పీఎస్‌కే లేదా పీవోపీఎస్‌కే(పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రా)లను ఎంచుకుంటే ప్రక్రియ మరింత వేగంగా పూర్తి అవుతుందని అధికారులు సూచిస్తున్నారు. తాజా జాబితా ప్రకారం కరీంనగర్ పీఎస్‌కేలో పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌కు 13 రోజులు, అమీర్‌పేట, బేగంపేటలో స్లాట్ లభించడానికి 15 రోజులు, టోలిచౌకిలో 20 రోజులు పడుతోంది.
జిల్లాల్లోనే వేగంగా, సులభంగా : నిజామాబాద్ జిల్లాలోని పీఎస్‌కేలో సాధారణ, తత్కాల్ అపాయింట్‌మెంట్‌కు ఒక్కరోజే తేడా ఉండటం గమనార్హం. నల్గొండ పీవోపీఎస్‌కేలో దరఖాస్తు చేసిన తర్వాతి రోజు వెంటనే అపాయింట్‌మెంట్ లభిస్తోంది. మేడ్చల్‌తో పాటు నల్గొండ, వికారాబాద్‌లో 80 స్లాట్లు, వరంగల్‌లో 120, ఆదిలాబాద్, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, భువనగిరి, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లోని పీవోపీఎస్‌కేల్లో 40 సాధారణ అపాయింట్‌మెంట్లు విడుదలవుతున్నాయి. అవి కేవలం ఒకటి నుంచి రెండ్రోజుల్లోనే లభ్యమవుతున్నాయి.
భారత్ శక్తిమంతమైన పాస్‌పోర్ట్ : ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను గతంలో (జూలై 2024) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ పాస్‌పోర్ట్ 82వ స్థానంలో నిలిచింది. ఇందులో గతంతో (2023) పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని పైకి ఎగబాకింది.